లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కెక్కిన తొలి అంధ దర్శకుడు

3 Dec, 2013 02:25 IST|Sakshi
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కెక్కిన తొలి అంధ దర్శకుడు
కరీంనగర్ శివారు ప్రాంతం. ‘మార్గదర్శి’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ ఏరియాలో సినిమా షూటింగ్ జరగడం చాలా రేర్. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒకటే జనం. అంతా కొత్త ఆర్టిస్టులు. వాళ్లంతా కరీంనగర్ రంగస్థల కళాకారులే. డెరైక్టర్ చాలా పెద్దాయన. నల్ల కళ్లజోడు పెట్టుకుని గంభీరంగా ఉన్నాడు. ఆర్టిస్టులకి సీన్ చెప్పి, కెమెరామేన్‌కి షాట్ ఎలా తీయాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాడాయన. సింగిల్ టేక్‌లో షాట్ ఓకే. అంతా క్లాప్స్. ఇంకో షాట్‌కి సిద్ధం.
 
62 ఏళ్ల వయసులో ఆ డెరైక్టర్ చకచకా సీన్లు తీసేస్తుంటే అందరూ ఆశ్చర్యంగా నోళ్లు వెల్లబెట్టి చూస్తున్నారు. అసలు విషయం తెలిశాక ఇంకా షాకయ్యారు. ఎందుకంటే ఆయనకు కళ్లు లేవు. కానీ ఆయన స్పీడు, టేకింగ్ చూస్తే వళ్లంతా కళ్లున్నట్టుగానే అనిపించింది. ఆయన పేరు బి.యస్.నారాయణ. తొలి అంధ దర్శకుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఘనుడు. బీయస్ నారాయణ అంటే సాదాసీదా దర్శకుడు కాదు. ఒక్క ‘ఊరుమ్మడి బ్రతుకులు’ చాలు ఆయన ప్రతిభ ఏంటో చెప్పడానికి. శారదకు ‘ఊర్వశి’ పురస్కారం తీసుకొచ్చిన ‘నిమజ్జనం’ సృష్టికర్త కూడా ఆయనే.
 
అంతా మాస్ మసాలా సినిమాల తోక పట్టుకుని గాల్లో ఎగురుతుంటే, ఈయనేమో మట్టి వాసనను నమ్ముకుని నేల మీద తాను గర్వంగా నిలబడి, తన సినిమానూ గర్వంగా నిలబెట్టాడు.35 ఏళ్ల కెరీర్‌లో 32 సినిమాలే తీశాడాయన. క్వాంటిటీ కన్నా క్వాలిటీనే నమ్ముకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ... భాష ఏదైనా కథలో నాణ్యత ఉండాలి. సినిమాలో నాణ్యత కనబడాలి. అందుకేనేమో ఆయన సినిమాలను ప్రజలూ మెచ్చారు. ప్రభుత్వమూ మెచ్చింది. జాతీయ అవార్డులు, నంది అవార్డులు... ఇంకా ఎన్నెన్నో పురస్కారాలు.ఎదురీత (1963), తిరుపతమ్మ కథ (1963), విశాల హృదయాలు (1965), ఆనంద నిలయం (1971), శ్రీవారు-మావారు (1973), ఆడవాళ్లు-అపనిందలు (1976), ఊరుమ్మడి బ్రతుకులు (1976), నిమజ్జనం (1979), ఆడది గడపదాటితే (1980)... అన్నీ గొప్ప కాన్సెప్టులే. 
 
హిందీలో 20 సూత్రాల పథకం నేపథ్యంలో ‘ఏక్ హి ఇతిహాస్’ అనే సినిమా తీశాడాయన. హేమమాలిని, విష్ణువర్థన్, వినోద్‌మెహ్రాలాంటి హేమాహేమీలు యాక్ట్ చేశారు. కన్నడంలో ‘మమతేయ బంధనం’ సినిమాలే కాదు. కార్మికుల సంక్షేమం, ఫెడరేషన్ వ్యవహారాలు, డెరైక్టర్స్ కాలనీ ఏర్పాటు... బీయస్ ముందుండి తీరాల్సిందే. సరే... ఇదంతా ఓ ఎత్తు. లాస్ట్ ఫేజ్‌కొచ్చేసరికి షుగర్ ఎటాక్ అయ్యింది. దాంతో అంధుడై పోయారాయన. రెండు కళ్లూ పోయాయి. ఇంకొకరైతే డిప్రెస్ అయిపోయి మంచాన్న కూలబడిపోయేవారు. బీయస్ నారాయణ మొండివాడు. విజన్ ఉన్నవాడు. కళ్లు లేకపోయినా కాన్ఫిడెన్స్ పోలేదుగా అనుకున్నాడు. అంబేద్కరిజాన్ని సమర్థిస్తూ ‘మార్గదర్శి’ మొదలెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన కెమెరామేన్‌ని తీసుకుంటారు. కానీ బీయస్ నారాయణ మాత్రం సురేందర్‌రెడ్డి అనే కొత్త కెమెరామేన్‌ని తీసుకున్నాడు. ఇప్పుడాయన తెలుగులో బిజీ కెమెరామేన్.
 
అంద్శై పాటల రచయితని చేశారు. యాంకర్ ఉదయభానుకి ఇదే తొలి సినిమా. జస్ట్ 28 రోజుల్లో సినిమా ఫినిష్. ఎక్కడా తొట్రుపాటు లేదు. చాలా కమాండింగ్‌గా షూటింగ్ పనులు పూర్తి చేశాడు. పక్కా ప్లానింగ్. పోస్ట్ ప్రొడక్షనూ అంతే. ఎడిటింగ్ ఎలా చేయాలో, తనకేం కావాలో ముందే చెప్పేశాడు. డబ్బింగ్, రీ-రికార్డింగ్ కూడా దగ్గరుండి చూసుకున్నాడు. అవుట్ పుట్ అదిరింది. బీయస్సా మజాకానా!అక్కడితో ఆగిపోలేదాయన. రేకుర్తి కంటి ఆసుపత్రి వాళ్ల కోసం ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే డాక్యుమెంటరీ తీసిచ్చాడు. ఇంకా ఇంకా ఏదేదో చేయాలనుకున్నాడాయన. కానీ పైవాడు తనకో సినిమా తీసిపెట్టమని చక్కా తీసుకుపోయాడు.
 
 ‘‘అప్పటికి నేను చాలా టీవీ సీరియల్స్‌కి పని చేశాను. నిర్మాతల ద్వారా బీయస్ నారాయణగారిని కలిశాను. నాకు ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా ఉందని తెలియడంతో చాలా ఆనందపడిపోయి, వెంటనే నన్ను కెమెరామేన్‌గా ప్రకటించేశారు. షాట్ డివిజన్, కంపోజిషన్స్ అన్నీ చెప్పేవారు. కెమెరా ఏ హైట్‌లో ఉంది, లెన్స్ ఏ రేంజ్‌లో ఉందో అడిగి తెలుసుకునేవారు. స్క్రిప్టు దశలోనే వాయిస్ ఓవర్, ఓవర్ లాప్స్ అన్నీ చెప్పేశారు. కళ్లు లేవనే విషయం మేం చెబితే కానీ తెలుసుకోలేనంత కాన్ఫిడెంట్‌గా, కమాండింగ్‌గా షూటింగ్ పూర్తి చేశారు. ఆయన విజన్ అంత గొప్పది’’. - సురేందర్ రెడ్డి, కెమెరామేన్