నా లైఫ్‌లో అది బెస్ట్‌ కాఫీ

19 Aug, 2018 02:29 IST|Sakshi
బన్నీ’ వాసు

‘‘సినిమా జెన్యూన్‌ హిట్‌ సాధించినప్పుడు పెద్ద హీరోలు ఆ సినిమా సక్సెస్‌ గురించి సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటారు. ఎప్పటికైనా నేను తీసిన సినిమాకు కూడా అలా జరగాలి అనే ఆకాంక్ష ఉండేది. అది ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమాను ఎడిట్‌ రూమ్‌లో చూసిన బన్నీ (అల్లు అర్జున్‌)గారు ఆత్మీయంగా హత్తుకున్నారు. అలాగే మూవీ రిలీజ్‌ తర్వాత మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌ స్పందించడం మర్చిపోలేను’’ అన్నారు ‘బన్నీ’ వాసు. విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గీత గోవిందం’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. ఈ చిత్రం హిట్‌ టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘బన్నీ’ వాసు పంచుకున్న విశేషాలు...

► సినిమా సక్సెస్‌ అవుతుందనుకున్నాం. కానీ ఈ రేంజ్‌ సక్సెస్‌ను ఊహించలేదు. ఫస్ట్‌ టైమ్‌ ఇండస్ట్రీలో మూవీ రిలీజైన రెండో రోజే బ్రేక్‌ ఈవెన్‌ సాధించిన మూవీ ‘గీత గోవిందం’. తమిళనాడులో కూడా ఊహించని కలెక్షన్స్‌ వచ్చాయి. ఫస్ట్‌ రోజే దాదాపు 1.18 కోట్ల గ్రాస్‌ వచ్చింది. షాకయ్యాం. కేరళలో అంత వర్షం కురుస్తున్నప్పటికీ ఫస్ట్‌ రోజే దాదాపు 14లక్షల గ్రాస్‌ వచ్చింది. నెక్ట్స్‌ డే 6 లక్షల గ్రాస్‌ వచ్చింది. అందుకే కొంత కలెక్షన్‌ను విరాళంగా ఇద్దాం అనుకున్నాం.

► నిర్మాతగా నాకు ప్రత్యేకమైన సక్సెస్‌ ఫార్ములా ఏమీ లేదు. సెట్‌లో నేనొక బ్రదర్‌లా డైరెక్టర్‌తో కలిసిపోతా. డైరెక్టర్‌ని బాగా అర్థం చేసుకుని ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇస్తా. ప్రాజెక్ట్స్‌ విషయంలో నాది జడ్డిమెంట్‌ కాదు.. నమ్మకం. ఈ సినిమాలో పరశురామ్‌ కూడా ఒక పార్ట్‌నర్‌. హీరో విజయ్‌ దేవరకొండకి పరశురామ్‌ కథ చెప్పాడు. డిఫరెంట్‌ సినిమాలు చేస్తున్నా. ఈ కథ వర్కౌట్‌ అవుతుందా? అని విజయ్‌ ఆలోచించాడు. అప్పుడు ఏ క్లాస్‌.. బీ క్లాస్‌ అని కాదు ఈ సినిమా యూనివర్శల్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవుతుందని చెప్పాను. నా సలహాను విజయ్‌ బాగా రీసివ్‌ చేసుకున్నాడు. విజయ్‌ నిజాయితీ, నిరాడంబరత చాలా బాగుంటాయి.

► ‘అర్జున్‌రెడ్డి’ రిలీజ్‌ తర్వాత మా సినిమా గురించి రెండు నెలలు టెన్షన్‌ పడ్డా. కానీ పరశురామ్‌ కథను మార్చలేదు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో అలాంటి క్యారెక్టర్‌ చేసిన విజయ్‌ ‘గీత గోవిందం’లో మేడమ్‌ మేడమ్‌ అంటూ హీరోయిన్‌ వెంటపడటం వర్కౌట్‌ అవుతుందా? అనిపించింది. అసలు సినిమాలో ఇదే కొత్తగా ఉంటుందని విజయ్, పరశురామ్‌ అన్నారు. వాళ్ల నమ్మకం నిజం అయ్యింది. ఈ సినిమా టైటిల్‌ క్రెడిట్‌ పరశురామ్‌దే. తనతో చేయబోయే మరో సినిమాలో హీరో గాడ్‌తో ట్రావెల్‌ అవుతుంటాడు.

► ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారు కరెక్ట్‌ స్క్రిప్ట్‌ను ఎంచుకోకపోతే కష్టం. అది స్టార్స్‌ వారసులైనా సరే. విజయ్‌ కరెక్ట్‌గా స్క్రిప్ట్‌ను ఎంచుకుంటాడు. ఇటీవల రిలీజైన ‘గూఢచారి’ స్క్రిప్ట్‌ ను అడివి శేష్‌ బాగా రాసుకున్నారు.

► ‘గీత గోవిందం’ సినిమా లీకేజ్‌ విషయం బాగా బాధించింది. హర్డ్‌డిస్క్‌లో డిలిటైన ఫైల్‌ను రిట్రీవ్‌ చేశారనిపిస్తోంది. హైప్‌ కోసం మేమే ఫుటేజ్‌ని లీక్‌ చేశామనే వార్తల్లో నిజం లేదు. కోట్లు పెట్టి సినిమా తీసి అలా ఏ నిర్మాతా చేయడు. ఒకవేళ పోలీస్‌ పరిశోధనలో మా వైపు తప్పు ఉంటే పోలీస్‌ వ్యవస్థ ఊరుకోదు కదా. మేమే లీక్‌ చేశామనే థాట్‌ ఉన్నవాళ్ల సినిమా రిలీజ్‌ ముందే ఆన్‌లైన్‌లో వస్తే అప్పుడు మా బాధ అర్థం అవుతుందేమో.

► ఇంతవరకు చిరంజీవిగారితో 5 నిమిషాలు గడిపింది లేదు. కానీ ఈ సినిమా డిస్కషన్‌లో భాగంగా ఆయనతో దాదాపు గంటసేపు మాట్లాడే అవకాశం దక్కింది. అప్పుడు ఆయనతో నేను తాగిన కాఫీ నా లైఫ్‌లో బెస్ట్‌ కాఫీ.

► బన్నీ మూవీ గురించి త్వరలో అనౌన్స్‌ చేస్తాం.

>
మరిన్ని వార్తలు