‘బుర్రకథ’ మూవీ రివ్యూ

5 Jul, 2019 16:07 IST|Sakshi

టైటిల్‌ : బుర్రకథ
జానర్‌ : కామెడీ ఎంటర్‌టైనర్‌
నటీనటులు : ఆది సాయి కుమార్‌, రాజేంద్రప్రసాద్‌, మిస్త్రీ చక్రవర్తి తదితరులు
సంగీతం : సాయికార్తీక్‌
దర్శకత్వం : డైమండ్‌ రత్నబాబు
నిర్మాతలు: కిరణ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ దీపాల, కిషోర్‌

ప్రేమ కావాలి, లవ్‌లీ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న హీరో ఆది సాయికుమార్‌. అయితే చాలా కాలంపాటు సరైన సక్సెస్‌లేక వెనుకబడ్డ ఆది.. ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఈసారి ‘బుర్రకథ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈసారి ఆది ఆశించిన విజయం లభించిందా? సరైన సక్సెస్‌లేక కొన్నేళ్లుగా తడబడుతున్న ఆయన కెరీర్‌ గాడిలో పడిందా? లేదా అన్నది ఓసారి చూద్దాం.

కథ
అభిరామ్‌(ఆది సాయికుమార్‌) పుట్టుకతోనే రెండు మెదళ్లు ఉండటంతో రెండు రకాలగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దీంతో అభిరామ్‌ కాస్త అభి, రామ్‌గా భిన్న వ్యక్తిత్వాలతో లైఫ్‌ గడిపేస్తూ ఉంటారు. ఏవైనా పెద్ద శబ్దాలను విన్నప్పుడు అభి, రామ్‌గా.. రామ్‌ అభిగా మారిపోతూ ఉంటారు. ఒక్కరిగానే పుట్టినా.. ఇద్దరిలా పెంచుతారు ఈశ్వర్‌ప్రసాద్‌ (రాజేంద్రప్రసాద్‌). వ్యతిరేక ధృవాలుగా ఉన్న అభి, రామ్‌ ఎప్పుడు ఒక రకంగా ఆలోచిస్తారో అని ఈశ్వర్‌ ప్రసాద్‌ ఎదురుచూస్తు ఉంటాడు. రెండు మెదళ్లైనా.. వారిద్దరిది ఒకే మనసు అని అభి, రామ్‌ తెలుసుకుంటారని ఆశిస్తూ ఉంటాడు? అయితే అభిరామ్‌ జీవితంలోకి హ్యాపీ (మిస్త్రీ చక్రవర్తి), గగన్‌ విహారి(అభిమన్యు సింగ్‌) రాకతో ఎలాంటి చిక్కులు వచ్చాయి? చివరకు అభి, రామ్‌ కలిసిపోయి అభిరామ్‌ అయ్యారా? అభిరామ్‌ తండ్రి ఈశ్వర్‌ ప్రసాద్‌ కోరిక నెరవేరిందా అన్నదే మిగతా కథ.

నటీనటులు
అభి, రామ్‌ రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో ఆది సాయి కుమార్‌ ప్రేక్షకులను మెప్పిస్తాడు. మొదటి చిత్రం నుంచి ఆది తన స్టెప్పులతో, ఫైట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా ఆది డ్యాన్స్‌, యాక్షన్స్‌తో ఆకట్టుకుంటాడు. అభిగా అల్లరిచిల్లరగా తిరిగే పాత్రకు, రామ్‌ లాంటి డీసెంట్‌ క్యారెక్టర్‌కు తన నటనతో వేరియేషన్‌ చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఇక తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ అలవోకగా నటించేశాడు. హాస్యాన్ని పండించడమే కాదు, ఎమోషన్స్‌ సీన్స్‌లోనూ తన అనుభవాన్ని చూపించాడు. హీరోయిన్‌గా మిస్త్రీ చక్రవర్తి పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా.. లుక్స్‌ పరంగా ఓకే అనిపించింది. మరో హీరోయిన్‌ అయిన నైరాషా కనిపించిన రెండు మూడు సీన్స్‌లో ఫర్వాలేదనిపించింది. మిగతా పాత్రల్లో కమెడియన్‌ పృథ్వీ, గాయత్రి గుప్తా, జబర్ధస్త్‌ మహేష్‌, విలన్‌ పాత్రలో అభిమన్యు సింగ్‌ తమపరిధి మేరకు నటించారు.

విశ్లేషణ
రచయితలు దర్శకులుగా మారి సినిమాలను తెరకెక్కించడం చూస్తూనే ఉన్నాం. అయితే అందులో కొందరు సక్సెస్‌ అవ్వగా మరికొందరు వెనకబడ్డారు. అయితే డైలాగ్‌ రైటర్‌గా మంచి పేరున్న డైమండ్‌ రత్నబాబు.. ఈ చిత్రంలో కూడా మంచి పంచ్‌ డైలాగ్‌లను రాశాడు. కంటెంట్‌ కంటే కామెడీ మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రత్నబాబు.. సినిమాను ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా మలచడంతో సక్సెస్‌ అయ్యాడు. ఇదే పాయింట్‌తో ఓ ప్రయోగం చేసే అవకాశం ఉన్నా.. కమర్షియల్‌ ఫార్మాట్‌లో తెరకెక్కించిడంతో ఏమంత కొత్తగా ఉండదు. పైగా స్క్రీన్‌ ప్లే కూడా అంత ప్రభావవంతంగా అనిపించదు. ప్రతీ సన్నివేశం అతికించినట్లు అనిపించడంతో.. చూసే ప్రేక్షకుడికి ఫ్లో మిస్‌ అయినట్లు అనిపిస్తుంది.

రత్నబాబు రచయితగా సక్సెస్‌ అయినా.. దర్శకుడిగా మాత్రం కాస్త తడబడ్డాడు. ఈ చిత్రాన్ని కమర్షియల్‌ హంగులతో, కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలచడంతో ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. కథలో ఏం జరగబోతోంది అన్నది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతూ ఉంటుంది. సంగీత దర్శకుడిగా సాయి కార్తీక్‌ ఓకే అనిపించాడు. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగానే ఎలివేట్‌ చేశాడు. కెమెరామెన్‌ ప్రతి సన్నివేశాన్ని తెరపై అందంగా చూపించాడు. ఎడిటింగ్‌ విభాగం ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. అందరూ ప్రయోగాల బాటపడుతున్న వేళ.. మళ్లీ అదే మూసధోరణిలో తీసిన ఈ చిత్రం ఏమేరకు విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

ప్లస్‌పాయింట్స్‌
నటీనటులు
సంగీతం
కామెడీ

మైనస్‌ పాయింట్స్‌
కథనం
కొత్తదనం లోపించడం

బండ కళ్యాణ్‌, సాక్షి వెబ్‌డెస్క్‌.

Poll
Loading...
మరిన్ని వార్తలు