కేసును రద్దు చేయండి

13 Jan, 2016 08:40 IST|Sakshi
కేసును రద్దు చేయండి

 హైకోర్టులో పిటిషన్  :శింబు


చెన్నై: నటుడు శింబు తనపై నమోదైన కేసుల నుంచి చాకచక్యంగా బయట పడే ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలను అగౌరపరిచేలా పాటరాసి, పాడిన బీప్ సాంగ్ వివాదంలో ఇప్పటికే మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు అర్హత పొందిన శింబు కోవై రేస్‌కోర్స్ పోలీసులు, చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసుల ఎదుట ఈ నెల 11న హాజరుకావలసి ఉన్నా ఆ తేదీని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఈ నెల 29కు గడువును పొందారు.
 
తాజాగా చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ మరో పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు.అందులో ఆయన పేర్కొంటూ ఒకే నేరానికి ఒకటికి మించిన కేసులు నమోదు చేయరాదని సుప్రీమ్ కోర్టు ఇంతకు ముందే తీర్పు ఇచ్చిందన్నారు. ఆ విధంగా బీప్ సాంగ్ అనే ఒక్క నేరానికి తనపై ఒక్క  కేసు మాత్రమే నమోదు చేయాలన్నారు. ఆ విధంగా కోవై పోలీసులు ఇంతకు ముందే తనపై కేసు నమోదు చేశారని అందువల్ల చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరారు.
 
 ఈ కేసు మంగళవారం న్యాయమూర్తి ఆర్.సుబ్బయ్య సమక్షంలో విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున నేరపరిశోధనా విభాగం న్యాయవాది షణ్ముగవేలాయుధం హాజరై వాదించారు. అయితే శింబు తరపు న్యాయవాది వేరే కోర్టుకు హాజరవడం వల్ల విచారణను న్యాయమూర్తి మధ్యాహ్నానికి వాయిదా వేశారు.