జీవితం విలువ తెలిసింది

30 Jan, 2019 00:00 IST|Sakshi

‘‘ఒకవేళ మళ్లీ బతికే అవకాశం వస్తే క్యాన్సర్‌ గురించి అందరికీ అవగాహన కలిగించడానికి నా వంతు కృషి చేస్తాను అని నాకు క్యాన్సర్‌ అని తెలియగానే ప్రామిస్‌ చేసుకున్నాను’’ అన్నారు నటి మనీషా కొయిరాలా. 2012లో మనీషాకు ఒవేరియన్‌ క్యాన్సర్‌ ఉన్న విషయం బయటపడింది. విదేశాలు వెళ్లి చికిత్స చేయించుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో ఆమె ముంబై చేరుకున్నారు. భయంకరమైన వ్యాధి సోకిన విషయం తెలిశాక తనలో ఆత్మస్థయిర్యం పెంచే కథనాల కోసం మనీషా వెతికారట. అయితే క్యాన్సర్‌ని జయించిన క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్, నటి లిసా రేల ‘సక్సెస్‌ స్టోరీ’ తప్ప వేరే ఎవరిదీ కనిపించలేదట. అందుకే ఓ పుస్తకం రాయాలనుకున్నారామె. ‘హీల్డ్‌’ పేరుతో తాను రాసిన పుస్తకాన్ని ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో ఆవిష్కరించారామె. ఈ నెల 24 నుంచి 28 వరకూ ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా మనీషా కొయిరాలా మాట్లాడుతూ –‘‘మన జీవితంలో మనకేదైనా చేదు అనుభవం ఎదురైనప్పుడు దాన్ని అధిగమించడానికి మనం ఏం చేశామో ఇతరులకు చెప్పాలి. అప్పుడు వాళ్ల మనసులో ఉన్న భారం తగ్గుతుందని నమ్మాను.. అందుకే ‘హీల్డ్‌’లో నా అనుభవాలు చెప్పాను. క్యాన్సర్‌ అనగానే ముందుగా ఎవరికైనా వచ్చే ఆలోచన ‘మరణం’. నాక్కూడా ఆ ఆలోచనే వచ్చింది. వ్యాధి గురించి తెలిసిన రోజు రాత్రి ఒంటరిగా గడిపాను. ఖాట్మండు నుంచి ముంబైకి వచ్చాను. అంతకుముందు లెక్కపెట్టలేనన్ని సార్లు ఆ ప్రయాణం చేశాను. కానీ మొదటిసారి నాకా జర్నీ విచిత్రంగా అనిపించింది.

నా గురువు దగ్గర భయంగా ఉందని చెప్పాను. ‘భయాన్ని వదిలించుకో. అయినా ఎందుకు భయపడుతున్నావు?’ అని అడిగారాయన. ‘మరణానికి’ అన్నాను. ‘మరణించడం అంటే ఏంటి?’ అన్నారాయన. ‘తెలియదు. చెప్పలేను’ అన్నాను. ‘మరి భయం ఎందుకు?’ అన్నారు. అంతే.. భయాన్ని పూర్తిగా మనసులోంచి తీసేశాను. భయం అనేది మనల్ని ఇంకా కుంగిపోయేలా చేస్తుందని అర్థమైంది. ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను. మనకేదైనా జరగరానిది జరిగితే జీవితం అంతే అనుకోకూడదు. భయపడకూడదు. సవాళ్లను స్వీకరించాలి. జయించాలనుకున్నాను. జయించాను. నిజానికి అంతకుముందు జీవితాన్ని ఇష్టం వచ్చినట్లుగా జీవించాను. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. అందుకే క్యాన్సర్‌ ఓ టీచర్‌లా నన్ను ఆవహించింది. అదొక పాఠం అయింది. ఇప్పుడు నా జీవితం అంటే నాకు చాలా విలువ. నా ఆరోగ్యం అంటే ఎంతో విలువ. ఆరోగ్యంగా లేకపోతే జీవితాన్ని ఆనందంగా గడపలేమని అర్థం చేసుకున్నాను. అందుకే జాగ్రత్తగా ఉంటున్నాను’’ అన్నారు.  

మరిన్ని వార్తలు