జయాపజయాలను అంచనా వేయడం మరో వంద సినిమాలు చేసినా నా వల్ల కాదు

18 Oct, 2013 00:08 IST|Sakshi
జయాపజయాలను అంచనా వేయడం మరో వంద సినిమాలు చేసినా నా వల్ల కాదు
మన్మథుడు, కింగ్, గ్రీకువీరుడు... ఇలాంటి టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన చిత్రం ఇది. వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ  సందర్భంగా నాగార్జునతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
 ***  ‘పగలు భాయ్.. చీకటి పడితే ప్లేబోయ్’ అని డైలాగ్ చెప్పారు.. ఇంతకీ ఆరు తర్వాత ఈ ప్లేబోయ్ ఏం చేస్తాడేంటి?
 (నవ్వుతూ) ఈ మధ్య ఓ ఆస్పత్రిలో షూటింగ్ చేశాం. సాయంత్రం ఆరు ఆవ్వగానే షూటింగ్‌కి పేకప్ చెప్పేసి, అందరం ఇంటికెళ్లే హడావిడిలో ఉన్నాం. అప్పుడు అక్కడున్న నర్సులు ‘ఏంటి సార్. ఆరయ్యింది కదా. ప్లేబోయా? అన్నారు సరదాగా. ఈ డైలాగ్ అంతలా అందరికీ రీచ్ అయ్యింది. ఇంకా ‘భాయ్’ సినిమాలో ఉన్న ఇతర పంచ్ డైలాగ్‌క్కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇక, ఈ ప్లేబోయ్ ఏం చేస్తాడో సినిమాలో చూస్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. 
 
 ***  ఇంతకూ ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
 ఫస్టాఫ్ అంతా ప్లేబోయ్‌లానే కనిపిస్తాను. చాలా సరదా సరదాగా ఉంటుంది. ముఖ్యంగా ఓపెనింగ్ సీన్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. మాఫియా డాన్‌లా, హాంగ్‌కాంగ్‌లో ఓ భాయ్‌కి రైట్ హ్యాండ్‌లా, ఓ సాదా సీదా వ్యక్తిలా... మూడు రకాల గెటప్స్‌లో కనిపిస్తాను. 
 
 ***  భాయ్ అంటే డాన్ అని, అన్నయ్యా అనీ అర్థం. మరి... ఆడవాళ్లు మిమ్మల్ని అన్నయ్యా అని పిలుస్తూ రాఖీతో రెడీ అయిపోతే ఏమనిపిస్తుంది?
 అన్నయ్యా అని పిలిస్తే ఆనందంగానే ఉంటుంది. కానీ, ఒక్క విషయం. నేను చెల్లెలు అనుకున్నవాళ్లందరూ నన్ను అన్నయ్యా అని పిలిచి, రాఖీ కడితే చాలా చాలా ఆనందపడతా.
 
 ***  ఇంతకూ ‘భాయ్’ ఏ కేటగిరీ సినిమా?
 మంచి కమర్షియల్ సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ సెంటిమెంట్సూ ఉంటాయి. యాక్షన్ వయొలెంట్‌గా ఉండదు. చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. ఇది ఫలానా కేటగిరీ మూవీ అని చెప్పలేం. అన్ని వర్గాలవారు చూసి ఆనందించే విధంగా ఉంటుంది.
 
 ***  ఈ 25నే విడుదల చేయాలని వెంటనే ఎందుకు నిర్ణయం తీసుకున్నట్లు?
 ఈ మధ్యకాలంలో మూడు, నాలుగు సినిమాలు వాయిదాలు పడటంవల్ల రిలీజ్ డేట్ విషయంలో కొంచెం సందిగ్ధం నెలకొంది. ఏ సినిమాకైనా సోలో డేట్ చాలా అవసరం. ఈ నెలాఖరున ‘క్రిష్ 3’ వస్తోంది. అది మాత్రమే కాకుండా నవంబర్ 1 నుంచి 14 వరకు బెంగళూరులో దక్షిణాది భాషా చిత్రాలను విడుదల చేయకూడదు. ప్రతి సంవత్సరం ఈ తేదీల్లో కన్నడ, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు తప్ప వేరేవి విడుదల చేయకూడదనే నిబంధన పెట్టారు. ఈ కారణాల వల్ల 25 బెస్ట్ డేట్ అనుకుని, రిలీజ్ ఫిక్స్ చేశాం.
 
 ***  వీరభద్రమ్ టేకింగ్ గురించి?
 బాగా తీశాడు. మంచి మ్యూజిక్ డెరైక్టర్, సినిమాటోగ్రాఫర్... ఇలా అందరూ మంచి టెక్నీషియన్స్ కుదిరారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అన్నిటినీ వీరభద్రమ్ సరిగ్గా వినియోగించుకున్నాడు. హిట్ సినిమా చేయాలనే తాపత్రయంతో అందరం కష్టపడి చేశాం.
 
 ***  ఈ చిత్రం పాటల్లో మీకు బాగా నచ్చినవి?
 అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మమతా మోహన్‌దాస్ పాడింది. ‘రయ్య రయ్య...’ పాటను మమతాతో పాడించారు. చాలా బాగా పాడింది. ఫోన్ చేసి, అభినందించాలనుకుంటున్నా.
 
 ***  ఈ మధ్య ప్రతి సినిమా పైరసీకి గురవుతోంది. ఒకవేళ  డీటీహెచ్ (డెరైక్ట్ టు హోమ్) విధానం ద్వారా థియేటర్లో విడుదల చేస్తే పైరసీ తగ్గుతుం దంటారా?
 ఆ అవకాశం ఉంది. కానీ, ఇలా విడుదల చేయడంవల్ల థియేటర్స్‌లో వసూళ్లు తగ్గే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి, థియేటర్లో విడుదల చేసిన రోజునే స్మాల్ స్క్రీన్స్‌కి విడుదలైన సినిమాలు లేవు. హాలీవుడ్‌లో కూడా ‘ఐరన్‌మేన్’లాంటి పెద్ద సినిమాలను థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తారు. తక్కువ ఓపెనింగ్స్ వస్తాయనిపించే చిన్న సినిమాలను మాత్రమే డీటీహెచ్‌లో కూడా విడుదల చేస్తుంటారు.
 
 ***  భవిష్యత్తులో మీరు ఈ విధానాన్ని అనుసరిస్తారా?
 విడుదలైన రోజునే కాదు.. మొదటి, రెండో వారం తర్వాత అయితే ఆలోచిస్తా. 
 
 ***  మీరు దాదాపు 80 సినిమాలకు పైగా చేశారు కాబట్టి, ఓ సినిమా జయాపజయాలను కరెక్ట్‌గానే అంచనా వేయగలుగుతారా?
 80 కాదు.. మరో 100 సినిమాలు చేసినా సినిమా జయాపజయాలు అంచనా వేయడం నా వల్ల కాదు. జయాపజయాలను ఊహించగలిగితే అన్నీ హిట్ సినిమాలే చేసేస్తాం. నాకు తెలిసి ఇప్పటివరకు ఓ సినిమాని వంద శాతం అంచనా వేసినవాళ్లు ఎవరూ లేరు.
 
 ***  ఓకే... ‘మనం’ సినిమా విషయానికొద్దాం.  ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఆ లుక్‌నే విడుదల చేయాలన్నది ఎవరి ఆలోచన?
 డెరైక్టర్ విక్రమ్‌కుమార్‌దే. సినిమా కథ చెప్పినప్పుడే ఈ ఫొటోగ్రాఫ్ గురించి చెప్పాడు. నాక్కూడా బాగా నచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తయ్యింది. డిసెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం.
 
 ***  ఈ సినిమా మొత్తం మీరిలా కళ్లద్దాలతోనే కనిపిస్తారా?
 మొత్తం కాదు.. కొన్ని సన్నివేశాల్లో అలా కనిపిస్తా.
 
 ***  ‘మనం’ తర్వాత చేయబోయే సినిమా?
 ఏమీ అనుకోలేదు. ఎందుకంటే, గత రెండేళ్లుగా విశ్రాంతి లేకుండా సినిమాలు చేస్తున్నా. అందుకని, కొంచెం కూల్‌గా తర్వాత సినిమాని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నా. సో.. ప్రస్తుతానికి ‘భాయ్’ ప్రమోషనల్ కార్యక్రమాలు, ‘మనం’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాను.
 
 ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్నారు. ముడతలు మాయమవ్వడం కోసం బొటాక్స్ ఇంజక్షన్స్ ఏమైనా చేయించుకున్నారా?
 బొటాక్స్ ఇంజక్షన్ చేయించుకుంటే ముడతలు మాయమవ్వడం సంగతి అటుంచితే, మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ కూడా మాయమవుతాయని నా ఫీలింగ్. ఫ్రీజ్ అయినట్లుగా కనిపిస్తాం. ఆ ఇంజక్షన్ చేయించుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. మరో పది, పదిహేనేళ్ల తర్వాత కూడా బొటాక్స్ జోలికి వెళ్లను. నాన్నగారికి ఇప్పటికీ ముడతలు ఉండవు. పళ్లు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో... నాన్నగారి జీన్స్ వల్ల మేం కూడా ముడతల బారిన పడమనుకుంటున్నా (నవ్వుతూ).