బాలీవుడ్‌ యువ కాస్టింగ్‌ డైరెక్టర్‌ మృతి

4 Jun, 2020 09:30 IST|Sakshi

బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో వెనువెంటనే పెను విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖుల వరుస మరణాలు బీటౌన్ ఇండస్టీ‍ని ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం పాటల రచయిత అన్వర్‌ సాగర్‌ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ యువ కాస్టింగ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ కపూర్‌ మృతి చెందారు. మెదడులో రక్తస్రావం జరిగి మే 31న ముంబైలో తుదిశ్వాస విడిచారు. క్రిష్‌ కపూర్‌ మరణాన్ని అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అతి చిన్న వయస్సులోని క్రిష్‌ కపూర్‌ మృతి చెందడం బాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.  28 ఏళ్ల వయసున్న కపూర్‌కు భార్య, ఏడేళ్ల పాప ఉన్నారు. (పాటల రచయిత అన్వర్‌ ఇక లేరు)

మహేష్‌ భట్‌ నిర్మాతగా వ్యవహరించిన ‘జలేబీ’, కృతి ఖర్బందా నటించిన ‘వీరే కి వెడ్డింగ్’‌ వంటి సినిమాలకు క్రిష్‌‌​ కాస్టింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే కపూర్‌ రోడ్డు ప్రమాదంలో మరణించాడని పలు వార్తలు వినిపించగా.. అతని మామయ్య సునీల్‌ భళ్లా ఈ వార్తలను ఖండించారు. సబర్బన్‌ మీరా రోడ్డులో ఉన్న తన ఇంట్లో క్రిష్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని వెంటనే ఆసుపత్రిలో చేర్చగా మెదడులో రక్తస్రావం ఏర్పడి మరణించాడని వెల్లడించారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, పూర్తిగా ఆరోగ్యంగా ఉండేవాడని ఆయన పేర్కొన్నారు. క్రిష్‌ మరణం తమ కుటుంబాన్ని షాక్‌కు గురిచేసిందని సునీల్‌ భళ్లా వాపోయారు. (చిరంజీవి ఇచ్చిన సరుకులే ఆసరా..)

మరిన్ని వార్తలు