తెలుగు ‘మెర్సల్‌’ ; సెన్సార్‌ బోర్డుపై విమర్శలు దారుణం

27 Oct, 2017 17:41 IST|Sakshi

‘అదిరింది’ని ఆపలేదన్న సీబీఎఫ్‌సీ చైర్మన్‌ ప్రసూన్‌ జోషి

సెన్సార్‌ బోర్డుపై విమర్శలకు కలత.. మీడియాకు వివరణ

సాక్షి, న్యూఢిల్లీ : వారాలకు వారాలు వాయిదా పడుతూ వస్తోన్న ‘అదిరింది’(మెర్సల్‌ తెలుగు డబ్బింగ్‌) సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ‘మెర్సల్‌’ లోని ప్రభుత్వ వ్యతిరేక డైలాగులపై వివాదం చెలరేగిన దరిమిలా, సెన్సార్‌ బోర్డు కవాలనే సినిమాను అడ్డుకుంటోందని నిర్మాతలు ఆరోపించారు. దీంతో సెన్సార్‌ బోర్డు తీరుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా, సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అయితే, సినిమా ఆలస్యానికి తాము ఏమాత్రమూ కారణం కాదని, అనవసరంగా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సెన్సార్‌ బోర్డు చీఫ్‌ ప్రసూన్‌ జోషి వాపోయారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘అదిరింది’ ఆలస్యంపై వివరణ ఇచ్చారు.

‘‘సెన్సార్‌ బోర్డు నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. ఏ రాజకీయ కారణమో, వాణిజ్యపరమైన అంశమో మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ‘మెర్సల్‌’ సినిమా తెలుగు డబ్బింగ్‌ ‘అదిరింది’ కి సర్టిఫికేట్‌ జారీ చేయడంలేదని మాపై విమర్శలు చేయడం దారుణం. తమిళ మాత్రుకకు ఎలాగైతే నిబంధనల ప్రకారమే సర్టిఫికేట్‌ ఇచ్చామో, తెలుగుకు కూడా అలానే ఇస్తాం. అయితే, మా పనిలో ఆలస్యం తలెత్తడం సహజం. నిజానికి సర్టిఫికేషన్‌కు గరిష్టంగా 68 రోజులు పడుతుంది. కానీ మేం సాధ్యమైనంత తొందరగానే పని పూర్తిచేసేస్తాం. కొన్నిసార్లు సెలవులు కూడా తీసుకోకుండా కష్టపడతాం. అలాంటిది మావల్లే సినిమా విడుదల ఆలస్యమవుతోందని విమర్శలు చేయడం సరికాదు’’ అని ప్రసూన్‌ జోషి వివరణ ఇచ్చారు.

మెర్సల్‌కు ఊరట : వివాదాస్పద ‘మెర్సల్‌’ను నిషేధించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం కొట్టేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీని విమర్శిస్తూ ‘మెర్సల్‌’లో డైలాగులు ఉండటాన్ని తమిళనాడు బీజేపీ తప్పుపట్టడంతో మొదలైన వివాదం క్రమంగా దేశాన్ని కుదిపేసే స్థాయికి వెళ్లింది. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ‘మెర్సల్‌’ మద్దతు పలికాయి. అంతలోనే విజయ్‌ క్రైస్తవుడు కాబట్టే  బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడంటూ కొందరు కాషాయ నేతలు వ్యాఖ్యానించడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. తమిళంలో రూపొందుకున్న ఈ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరుతో అనువదించారు. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించినా, తెలుగులో అంతకంతకూ ఆలస్యమవుతూ వచ్చింది.

మరిన్ని వార్తలు