గొల్లపూడి మృతికి ప్రముఖుల స్పందన

13 Dec, 2019 00:54 IST|Sakshi
మారుతీరావుతో నిఖిల్‌

మా ఇద్దరిదీ గురుశిష్యుల బంధం

‘‘గొల్లపూడి మారుతీరావుగారిది, నాది గురుశిష్యుల బంధం. ఆయన కుమారుడి పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్‌ అవార్డ్‌ ఫంక్షన్‌కి ఇటీవల నేను వెళ్లాను. తర్వాత మళ్లీ నాకు ఆయన్ను కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. నేను 1979లో ‘ఐ లవ్‌ యూ’ అనే సినిమా చేశాను. ఆ చిత్రనిర్మాత భవన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతీరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతీరావుగారు చాలా పెద్ద రచయిత, పాత్రికేయుడిగానూ చేశారు. సాహిత్యపరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికులు. ఆయన దగ్గర డైలాగ్స్‌ నేర్చుకోమని నన్ను పంపించారు. అప్పుడు మారుతీరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాసులు తీసుకున్నారు.

ఆ విధంగా ఆయన నాకు గురువనే చెప్పాలి. ఎన్నో సాహిత్యపరమైన విషయాలు చెప్పేవారు. గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే ఆసక్తిగా వింటుండేవాడిని. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఒక రకమైన శాడిజమ్, కామెడీగా ఉండే క్యారెక్టర్‌కి గొల్లపూడిగారు బాగుంటారనగానే నాకూ కరెక్ట్‌ అనిపించింది. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. ఆ విధంగా నా సహనటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి. ఆ తర్వాత నుంచి ‘ఆలయశిఖరం’, ‘అభిలాష’, ‘చాలెంజ్‌’... ఇలా ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం.
– నటుడు చిరంజీవి

‘హ్యాపీడేస్‌’ (2007) చిత్రానికి ముందు ఓ చిన్న సినిమా కోసం యాక్టర్‌ కమ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా గొల్లపూడి మారుతీరావుగారితో  పని చేశాను. గొల్లపూడిగారు నాకు ఇచి్చన సలహాలు, సూచనలు ఇప్పటికీ నాతో ఉన్నాయి. గొప్ప చిత్రాలతో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి  
– నటుడు నిఖిల్‌

నన్ను హీరో అని పిలిచేవారు

నేను సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన చిత్రం ‘కళ్లు’. నాకు నటుడిగా జన్మనిచ్చిన తండ్రి మారుతీ రావుగారు. ఆ సినిమా కథ ఆయనదే. ఆ సినిమా తర్వాత నటులుగా కూడా నేను, ఆయన చాలా సినిమాలు చేశాం. ఆయనకు ‘అరుణాచ లం’ అంటే ఇష్టం. విచిత్రంగా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. ‘కళ్లు’ సినిమా అప్పటినుంచి ఇప్పటివరకూ నన్ను ‘హీరో’ అనే పిలిచేవారు. ‘కళ్లు’ అనేది నా జీవితంలో మంచి జ్ఞాపకం. ప్రముఖ కెమెరామేన్‌ ఎం.వి. రఘు ఈ సినిమాతో దర్శకుడయ్యారు. గొల్లపూడిగారికి చాలా ఇష్టమైన కథ ‘కళ్లు’. ఈ సినిమాకి ‘తెల్లారింది లెగండో..’ అనే మంచి పాట రాశారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు. ఆయన పెద్ద కొడుకు పేరు రాజా. నన్నూ కొడుకులా భావించి, ‘రాజా’ అనే పిలుస్తారు.

ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు సంగీతదర్శకుడు. ఈ సినిమాకి మూడు నంది అవార్డులు వచ్చాయి. నిజానికి ఈ సినిమాని రజనీకాంత్‌ హీరోగా తమిళంలో మొదలుపెట్టారు. రెండు మూడు రీళ్లు తీశాక ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో నన్ను హీరోగా పెట్టి తీశారు. నంది అవార్డు మాత్రమే కాదు.. అప్పుడు ఉన్న ప్రైవేట్‌ అవార్డులతో కలిపి నాకు పదిహేను పదహారు అవార్డులు వచ్చాయి. అలా ‘కళ్లు’ సినిమాకి చాలా విశేషాలున్నాయి. అంతటి మంచి సినిమాకి అవకాశం ఇచ్చారు. గొల్లపూడిగారు మంచి నటుడు, రచయిత. ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ‘కళ్లు’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐదేళ్ల క్రితం ఫంక్షన్‌ చేశాం. ఆ ఫంక్షన్‌లోనే చివరిసారి ఆయన్ను కలిశాను. ఆయన ఎక్కడ తిరుగుతుంటే అక్కడ సరస్వతి తిరుగుతున్నట్లు అనిపించేది. అంతటి మహానుభావుడిని కోల్పోయాం. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది.    
– నటుడు శివాజీరాజా     

అది ఆయనకే సాధ్యం

గొప్ప నటుడు, రచయిత అయిన గొల్లపూడి మారుతీరా వుగారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రచయితగా నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన కథారచయితగా, మాటల రచయితగా, స్క్రీన్‌ ప్లే రచయితగా మూడు నంది అవార్డులు గెలుచుకున్నారు. అది ఎవరికీ సాధ్యం కాదు. అలాగే ఆయనకు ఒక పెక్యులియర్‌ స్టైల్‌ ఉంది. టైమింగ్‌ ఉంది. విచిత్రమైన మాడ్యులేషన్‌ ఉంది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చాలెంజ్‌.. ఇలా ఆయన ఎన్నో సినిమాల్లో చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అటువంటి గొప్ప రచయిత, నటుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. సినీ రంగానికి ఇది తీరని లోటుగా భావిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
– రచయిత, నిర్మాత కోన వెంకట్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా