స్టార్స్‌... జూనియర్స్‌

6 Dec, 2019 11:02 IST|Sakshi
అన్షురెడ్డి ,జూనియర్‌ దీపిక...మహిమా సునీత్‌

తారల రూపురేఖలతో సెలబ్రిటీ హోదా

పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చిన సమంత డూప్స్‌

మరికొందరు తారల పోలికలతోనూ స్టార్‌డమ్‌

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. సాధారణ మనుషులను పోలి ఉండడం వేరు స్టార్స్‌ను తలపించడం వేరు. సెలబ్రిటీలను తలపించే రూపం ఉంటే చాలు స్టార్‌డమ్‌ వచ్చేస్తుంది. సోషల్‌ మీడియాలో వెలిగే తారల జూనియర్స్‌ని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది.  

సాక్షి, సిటీబ్యూరో  :సెలబ్రిటీలను అనుసరించే, అనుకరించేవారు మనకి కొత్తేం కాదు. ఎన్టీయార్‌ కాలం నుంచీ నేటి నవతరం హీరోల దాకా వారి డూప్స్‌ను మనం చూస్తూనే ఉన్నాం. అయితే  సెలబ్రిటీల రూపంలో ఉండడం కన్నా వారిలా మాట్లాడడం, హావభావాలు ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేవారే వారిలో అధికం. అంతేకాకుండా హీరోలకు ఉన్న ఆదరణ దృష్ట్యా చాలా వరకూ డూప్స్‌ హీరోలకే పుట్టుకొచ్చేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. సోషల్‌ మీడియా యుగంలో హీరోయిన్లకూ డూప్స్‌ పుట్టుకొస్తున్నారు. సెలబ్రిటీలకు మక్కీకి మక్కీ రూపంతో వీరు ఫాలోయింగ్‌ పెంచుకుంటున్నారు.

కేథరిన్‌
సమంత... ఆకాశమంత...
తెలుగు హీరోయిన్లలో చాలా విషయాల్లో అరుదైన విజయాలు స్వంతం చేసుకున్న నవతరం నటి సమంత.  అటు« ధరించే డ్రెస్సుల శైలితో ఫ్యాషనబుల్‌గానూ, ఇటు ఆపన్నులను ఆదరించే గుణం ద్వారా ఎమోషనల్‌గానూ మనకి కనెక్టయిన ఈ అక్కినేని వారింటి కోడలికి అభిమానుల ఆదరణ అంతా ఇంతా కాదు. దానితో పాటే ఆమెకు డూప్స్‌ కూడా ఎక్కువే. అచ్చంగా సమంత లా అనిపిస్తూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ను దక్కించుకున్న వారిలో నగరవాసి అన్షురెడ్డి టాప్‌లో ఉంటారు. టిక్‌ టాక్‌ వీడియోలు, షార్ట్‌ ఫిలిమ్స్‌ వంటి వాటి ద్వారా అన్షుకి వచ్చిన గుర్తింపులో ఆమెకున్న సమంత రూపురేఖలకే అధిక భాగం చెందుతుందనడం అతిశయోక్తి కాదు. తాజాగా బిగ్‌బాస్‌–3లోకి ఆమెకి ఎంట్రీ కూడా అందిందంటే.. శామ్‌ ఫీచర్స్‌కి ఉన్న సత్తా అర్థం చేసుకోవచ్చు. ఈమెకి ఇన్‌స్ట్రాగామ్‌లో 5లక్షల పై చిలుకు ఫాలోయర్స్‌ ఉన్నారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకున్న మరికొందరు కూడా మేము సైతం సమంతలమే అంటూ దూసుకొచ్చేశారు  మరో నగరవాసి పద్దుశామ్‌ సైతం సమంత ఫీచర్స్‌తోనే పాప్యులర్‌ అయిపోయింది. ఈమె ఏకంగా సమంత పక్కనే యూ టర్న్‌ సినిమాలో కూడా నటించేసింది.  నగరానికి చెందిన మరో యువతి కేథరిన్‌ కూడా తనకున్న సమంత పోలికలతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

చిదిమి ‘దీపిక’నుపట్టుకోవచ్చు
సమంత అంత కాకపోయినా ఇతర భాషా చిత్రాల్లోని తారలకు కూడా సోషల్‌ డూప్స్‌ పుట్టుకొచ్చేస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునేను తలపిస్తుంది మహిమా సునీత్‌. బెర్లిన్‌లో ఆర్కిటెక్చర్‌ చదువుతూన్న మహిమ...అచ్చంగా దీపిక పోలికలతోనే సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ దక్కించుకుంది. 

కాజల్‌లా..
మరో టాలీవుడ్‌ హీరోయిన్‌ కాజల్‌కు సైతం డూప్స్‌ ఉన్నారు. ప్రస్తుతం మెడిసిన్‌ చదువుతున్న మేఘనకు వచ్చిన ఫాలోయింగ్‌ నేపథ్యం కాజల్‌ రూపురేఖలే. కాజల్‌ ఫీచర్స్‌తో టిక్‌టాక్‌ వీడియోలు చేసి ఫేమస్‌ అయిన ఈ యువతికి సొంత యూట్యూబ్‌ చానెల్‌ కూడా ఉంది.ఇలా తారలకు డూప్స్‌గా పలువురు పాపులర్‌ అయిపోవడంతో వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఎవరైనా స్టార్‌లా ఉన్నామా అని మరికొంత మంది తమ ఫీచర్స్‌ను పరీక్షించుకుంటున్నారు. కాసిన్ని పోలికలు ఉంటే బోలెడంత ఫేమస్‌ అయిపోవచ్చునని ఆశించేవారుపెరుగతుండడంతో రానున్న రోజుల్లో మరింత మంది స్టార్స్‌–జూనియర్స్‌పుట్టుకొచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా