ఆ కష్టం ‘ఛలో’తో తెలిసింది – నిర్మాత ఉష

17 Feb, 2018 02:09 IST|Sakshi
నాగశౌర్య, ఉష, శంకర్‌ప్రసాద్, వెంకీ, శ్రీనివాస్, గౌతమ్‌

‘‘మేం గతంలో మా ఫ్యామిలీతో సినిమాలు చూసేవాళ్లం. సినిమా తీయాలంటే హీరో, హీరోయిన్, దర్శకుడు ఉంటే చాలనుకునేవాళ్లం. కానీ మా ‘ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌’ ప్రారంభించాక ఓ విషయం అర్థమైంది. తెరమీద కనిపించే వారి వెనక వందలాది శ్రామికుల కష్టం ఉంటుందని’’ అన్నారు నిర్మాత ఉష మూల్పూరి. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఆమె నిర్మించిన చిత్రం ‘ఛలో’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయపథంలో దూసుకెళుతోందని ఉష తెలిపారు. ఈ సందర్భంగా ‘ఛలో’ చిత్రానికి పని చేసిన 24 క్రాఫ్ట్స్‌ వాళ్లని సత్కరించారు.

అనంతరం ఉష మాట్లాడుతూ– ‘‘వెంకీ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే మేం ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశాం. ఐరా క్రియేషన్స్‌ మొదలు పెట్టడానికీ, ఇంత మంచి హిట్‌ సినిమా ఇచ్చిన వెంకీకి కృతజ్ఞతగా కారు గిఫ్ట్‌గా ఇచ్చాం. తను మరిన్ని విజయాలు సాధించాలి’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘సినిమాకి వెళతానంటే నా తల్లిదండ్రులు డబ్బులిచ్చారు. నాగశౌర్య తల్లిదండ్రులు డబ్బులిచ్చి సినిమా తీసారు. వారి రుణం మరచిపోను. ఈ చిత్రం చేసే అవకాశం ఒక గిఫ్ట్‌ అయితే.. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చేయటం డబుల్‌ గిఫ్ట్‌... ఇప్పుడు నాకు కారు గిఫ్ట్‌ ఇవ్వటం జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌గా ఫీలవుతున్నా. నాగశౌర్య పరిచయం కాకపోతే నాకు ఈ జీవితం లేదు’’ అన్నారు. శంకర్‌ ప్రసాద్, నాగశౌర్యలతో పాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు