‘చాణక్య’ మూవీ రివ్యూ

5 Oct, 2019 14:46 IST|Sakshi
Rating:  

టైటిల్: చాణక్య
జానర్: స్పై థ్రిల్లర్‌
నటీనటులు: గోపీచంద్‌, మెహరీన్‌, జరీన్‌ ఖాన్‌, నాజర్, రాజేష్ కట్టర్ తదితరులు
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
నిర్మాత: రామ బ్ర‌హ్మం సుంక‌ర‌
దర్శకత్వం: తిరు

టాలీవుడ్‌ మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్‌ గట్టి హిట్టు కొట్టి చాలా కాలమైంది. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ హీరోకు ఈ మధ్యకాలంలో సరైన విజయం దక్కలేదు. పంతం, ఆక్సీజన్‌, గౌతం నందా, ఆరడుగుల బుల్లెట్‌ లాంటి చాలా సినిమాలు గోపీచంద్‌ చేసినా.. ఏ సినిమా కూడా అతని ఆశలను నిలబెట్టలేకపోయింది. ఈ క్రమం ‘చాణక్య’ అంటూ స్టైలిష్‌ స్పై చిత్రంతో గోపీచంద్‌ ఈ దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గూఢచారి నేపథ్యంతో వచ్చిన వచ్చిన ఈ సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించిందా? గోపీచంద్‌ ‘చాణక్య’ శపథం నెరవేరిందా? ఓ సారి తెలుసుకుందాం...

కథ:
పాక్‌ ఉగ్రవాద దాడుల నుంచి దేశాన్ని రక్షించడానికి అర్జున్ (గోపీచంద్) రా ఏజెంట్‌గా సీక్రెట్ ఆపరేషన్‌ నడుపుతుంటాడు. బయటకు మాత్రం బ్యాంక్ ఉద్యోగి రామకృష్ణగా చలామణీ అవుతుంటాడు. తన సీక్రెట్‌ ఆపరేషన్‌లో భాగంగా భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు కారకుడు.. పాక్‌ చెందిన ఇబ్రహీం ఖురేషీ అని అర్జున్‌ తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఖురేషీకి చెందిన అబ్దుల్ సలీమ్‌ను అర్జున్‌ హతమారుస్తాడు. ఇందుకు ప్రతీకారంగా అర్జున్‌ టీమ్‌లో సభ్యులైన అతని నలుగురు స్నేహితులు (రా ఏజెంట్స్‌)ను ఖురేషీ కిడ్నాప్ చేసి కరాచీకి పట్టుకుపోతాడు. ఈ మేరకు ఖురేషీ అర్జున్‌కు ఇచ్చిన షాక్‌తో ఫస్టాప్‌ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో గోపీచంద్‌ కరాచీ వెళ్లి తన నలుగురు ఫ్రెండ్స్‌ను ఎలా కాపాడాడు? దేశాన్ని ఉగ్రముప్పు నుంచి ఎలా బయటపడేశాడన్నది మిగిలిన కథ.

విశ్లేషణ
కథ రోటీన్‌గానే ఉంది. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చిన ఫీలింగ్‌ కలుగుతోంది. కథనం కూడా కొత్తగా లేకపోవడం ప్రేక్షకులకు కొంత బోరింగ్‌ అనిపించవచ్చు. దర్శకుడు తిరు తీసుకున్న పాయింట్‌ను కొత్తగా గ్రిప్పింగ్‌గా చెప్పడానికి ప్రయత్నించకుండా.. రోటిన్‌ సీన్లతో లాగించడం, యాక్షన్‌ డోస్‌ పెంచడం ఈ సినిమాలో కనిపిస్తోంది. గోపీచంద్‌-మెహరీన్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ కొంత బాగున్నా.. కుక్కల డాక్టర్‌గా అలీతో చేయించిన హాస్యం పండకపోగా.. కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి కథాకథనాలు అనుకున్నంత వినూత్నంగా లేకపోవడం, ఒక స్పై థ్రిల్లర్‌కు ఉండాల్సిన ఉత్కంఠభరిత సన్నివేశాలు అంతగా లేకపోవడం ఈ సినిమా మైనస్‌ అని చెప్పవచ్చు.

హీరో గోపీచంద్‌ రా ఏజెంట్‌ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఛేజింగ్‌ సీన్లతో దర్శకుడు ఇచ్చిన పాత్రకు నూటికినూరుపాళ్లు న్యాయం చేశాడు. అయితే, కథలోనే కావాల్సినంత సరుకు లేకపోవడం.. గోపీచంద్‌ పాత్ర కూడా పెద్దగా పేలలేదు. ఇక, హీరోయిన్‌ ఐశ్యర్వగా మెహరీన్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటలు, హీరోతో రొమాన్స్‌కే పరిమితం. సెకండాఫ్‌లో వచ్చే జరీన్‌ ఖాన్‌ పాత్ర తన పరిధి మేరకు ఆకట్టుకుంది. రా చీఫ్‌ పాత్రలో నాజర్ కనిపిస్తారు. టెక్నికల్‌గా స్పై థ్రిల్లర్ మూవీస్‌కు ఉండాల్సిన గ్రాండ్ లుక్‌ను తీసుకురావడంలో డైరెక్టర్‌ తిరు సక్సెస్‌ అయ్యాడని చెప్పాలి. ఛేజింగ్‌ సీన్లు కూడా బాగానే ఉన్నాయి. సంగీతం సోసోగా ఉన్నా.. . శ్రీ చరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్‌ పర్వాలేదనిపిస్తుంది. కెమెరావర్క్ కూడా ఓకే అని చెప్పాలి.

బలాలు
ప్రొడక్షన్ వ్యాల్యూస్
సినిమాటోగ్రఫి
గ్రాండ్‌ లుక్‌

బలహీనతలు
కథాకథనాలు కొత్తగా లేకపోవడం
సినిమా రోటీన్‌గా ఉండటం

Rating:  
(2.25/5)
Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా