సిటీ ఫ్రీడమ్ ఫ్రెండ్లీ

28 Oct, 2017 10:48 IST|Sakshi

షార్ట్‌ ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి.. ‘కేటుగాడు’తో తెరంగ్రేటం చేసి.. ‘శమంతకమణి’లా మెరిసిన ‘కుందనపు బొమ్మ’లాంటి పదహారణాల తెలుగమ్మాయి చాందినీ చౌదరి. ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆమె నటించిన మరో చిత్రం ‘హౌరాబ్రిడ్జి’విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చాందిని సిటీతో అనుబంధం, తన నటనా ప్రస్థానాన్ని వివరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...

మాది వైజాగ్‌. బెంగళూర్‌లో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. బీటెక్‌లో ఉండగా స్నేహితుల కోరిక మేరకు షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించాను. నేను, హీరో రాజ్‌తరుణ్‌ కలిసి 2011లో నటించిన ‘బ్లైండ్‌ డేట్‌’ షార్ట్‌ఫిలిమ్‌కి మంచి స్పందన వచ్చింది. తర్వాత లక్కీ, నౌదోగ్యారా, లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ షార్ట్‌ఫిల్మ్స్‌తో నెటిజన్లకు మరింత చేరువయ్యాను. 2014లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నేను, రవి నటించిన ‘మధురం’ షార్ట్‌ ఫిలిమ్‌ యూట్యూబ్‌లో సూపర్‌హిట్‌ అయింది.  

వెండితెరపై అవకాశం..
‘మధురం’ సోషల్‌లో వైరల్‌ అవడంతో వెండితెరపై అవకాశాలొచ్చాయి. అయితే అప్పుడు చదువు కోసం సినిమాలు వదులుకున్నాను. 2015లో కేటుగాడు చిత్రంలో హీరోయిన్‌గా నటించాను. అనంతరం కుందనపు బొమ్మ, శమంతకమణి చిత్రాల్లో చేశాను. హీరో రాహుల్‌ రవీంద్రన్‌తో కలిసి నటించిన ‘హౌరాబ్రిడ్జి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌తో కలిసి నటించిన ‘మను’ చిత్రం త్వరలో విడుదల కానుంది.  

సిటీ చుట్టేయాలి...  
హైదరాబాద్‌ అంతా చుట్టేయాలని ఉంది. అయితే షూటింగ్‌లతో బిజీగా ఉండడంతో కుదరడం లేదు. ఇక్కడ ఎక్కువ సమయం గడపాలనుకున్నా వీలు కావడం లేదు. దేశంలోనే ఇది డిఫరెంట్, ఫ్రీడమ్‌ అండ్‌ ఫ్రెండ్లీ సిటీ. సిటీలో ఉలవచారు బిర్యానీ అంటే చాలా ఇష్టం. జూబ్లీహిల్స్‌లోని కొన్ని రెస్టారెంట్స్‌లో దొరికే ‘జపనీస్‌ సూశి’ వంటకాన్ని ఎంతో ఇష్టంగా లాగించేస్తా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ వంటకాన్ని రుచి చూస్తాను. షాపింగ్‌ చేయడమంటే ఇష్టం.

స్పోర్ట్స్‌ అంటే  ఇష్టం.. నాకు స్పోర్ట్స్‌ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడల్లో అధికంగా పాల్గొనేదాన్ని. త్రోబాల్, ఖోఖో, లాంగ్‌జంప్‌లలో రాష్ట్రస్థాయిలో పాల్గొన్నాను. పెయింటిం కూడా వేస్తాను. పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌లో నా చిత్రాలు ప్రదర్శించాను. ఫేస్‌బుక్‌లో 5లక్షల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 2.3 లక్షల మంది అభిమానులు ఉన్నారు. వారందరి ఆదరాభిమానాలతో తెలుగు తెరపై రాణిస్తున్నాను.

మరిన్ని వార్తలు