నన్ను చూసి'నారా'!

13 Dec, 2019 08:20 IST|Sakshi

చంద్రబాబు నాయుడు పాత్రకు న్యాయం చేశా

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రానికి ఆదరణ  

ప్రేక్షకుల మధ్య కూర్చుని ఈ సినిమా చూశా   

తనలో మంచి నటుడు ఉన్నాడన్న ధనుంజయ్‌ ప్రభు

ఆ హావభావాలు.. ఆ కంటిచూపు.. కనుముక్కు తీరు.. శరీర కదలికలు.. నడక.. ఒడ్డూ పొడుగూ అచ్చం చంద్రబాబు నాయుడు పోలికలే. ఆయన పాత్రలో ఒదిగిపోయి మెప్పించారు. నటనలో ఏమాత్రం అనుభవం లేని ఓ సాధారణ వ్యక్తి పాత్ర పోషణలో ఔరా అనిపించారు. ఆయనే ధనుంజయ్‌ ప్రభు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రంలో మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిగా నటించారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు ధనుంజయ్‌ ప్రభు (55) బుధవారం రాత్రి హైదరాబాద్‌ వచ్చారు. శ్రీనగర్‌ కాలనీలోని విన్‌ఫ్లోరా హోటల్‌లో దిగారు. గురువారం ఉదయం సినిమా చూసేందుకు జూబ్లీహిల్స్‌లోని చట్నీస్‌ హోటల్‌లో అల్పాహారం తీసుకుని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చిత్రాన్ని చూశారు. ఈ సినిమాలో నటించేందుకు తనకు వచ్చిన అవకాశం, ఆదరణ తదితర అంశాలపై ఆయన ఇలా ముచ్చటించారు.

బంజారాహిల్స్‌: మాది ముంబై. ఆటో రిక్షా యూనియన్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశాను. అక్కడ బతుకుభారం కావడంతో థానే సమీపంలోని త్రయంబకేశ్వర్‌లో మహాలక్ష్మి భవన్‌ పేరుతో రెస్టారెంట్‌ను నడుపుతున్నాను. ఒకరోజు హోటల్‌ సప్లయర్‌ రాకపోవడంతో నేనే కస్టమర్లకు భోజనం సరఫరా చేయాల్సి వచ్చింది. నాకు తెలియకుండానే ఓ కస్టమర్‌ నేను భోజనం వడ్డిస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. తాను మాజీ సీఎం చంద్రబాబు నాయుడులా  ఉంటానంటూ ఫేస్‌బుక్‌లో పెట్టడంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. నన్ను పలకరించడానికి చాలా మంది వచ్చారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన రామ్‌గోపాల్‌వర్మ నా ఆచూకీ తెలుసుకోవడానికి రెండునెలలు కష్టపడి ఎట్టకేలకు మా హోటల్‌కే వచ్చారు. నన్ను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. నేను అచ్చంగా చంద్రబాబునాయుడులా ఉంటానని చెప్పారు. 

కొద్దిరోజుల తర్వాత ఫోన్‌ కాల్‌..   
వర్మ వెళ్లిపోయిన తర్వాత కొద్దిరోజులకు నాకు ఫోన్‌ కాల్‌వచ్చింది. వారం రోజుల పాటు హైదరాబాద్‌ రావాలనిచెప్పడంతో ఇక్కడికి వచ్చాను. అప్పుడే నన్ను సినిమాలో చంద్రబాబు పాత్రలో నటించాలని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. వర్మ పేరున్న దర్శకుడు కావడం నన్ను నటించమని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఈ సినిమా కథ మొదట్లో తెలియదు. నాకు ఆ పాత్రలో నటించడం వరకే చెప్పారు. నాలో నటుడు ఉన్నాడన్న విషయాన్ని వర్మనే బయటకు తీశారు. ఆయనకు కృతజ్ఞతలు.

మూడు వారాలు బాబు వీడియోలు చూశా..
‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలో చంద్రబాబు పాత్ర పోషించేందుకు నన్ను ఒప్పించారు. బాబు ఆహార్యం, అలవాట్లు, డ్రెస్‌ సెన్స్, పద్ధతులు, హావభావాలు అన్నీ అచ్చు గుద్దినట్లుగా ఉండాలని వర్మ చెప్పడంతో ఇక్కడే ఉండి చంద్రబాబుకు సంబంధించిన పలు వీడియోలు, ప్రసంగాలు, అసెంబ్లీలో ఆయన హావభావాలు గమనించాను. 

సినిమా బాగా వచ్చింది..
ఈ సినిమాలో చంద్రబాబు పాత్రకు బాగా రెస్పాన్స్‌ వచ్చింది. బాబులో పరకాయ ప్రవేశం చేశావంటూ మెచ్చుకున్నారు. జబర్దస్త్‌ ఫర్మామెన్స్‌ చేశావని కొనియాడారు. ఇప్పుడు నేను సెలబ్రిటీనయ్యాను. సినిమా చూసి బయటకురాగానే వందలాది మంది ప్రేక్షకులు నా వద్దకు వచ్చి ఫొటోలు దిగారు. చంద్రబాబులా నటించడం చాలా కష్టమని ఇప్పుడే తెలిసింది. ఈ సినిమా మంచి కాలక్షేపం. ఫన్నీగా ఉంటుంది.  

సినీ అవకాశాల్ని వదులుకోను..
ఈ సినిమాలో నా పాత్రకు మంచి స్పందన వచ్చింది. చంద్రబాబు పాత్ర కావడంతో బాగా పేరొచ్చింది.నా నటన కూడా అందరికీ నచ్చింది. వర్మసినిమాలో నటించడంతో మరింత పేరొచ్చింది. మంచి అవకాశాలు వస్తే నటిస్తాను. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా