ఇష్టమొచ్చినట్లు అవార్డులిస్తే సినిమాలు తీయడమెందుకు?

18 Nov, 2017 01:34 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన విధానం, జ్యూరీ తంతు చూస్తుంటే వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లే కనిపిస్తోంది. మంచి సినిమాలకు అన్యాయం జరిగిందనే బాధ కలిగింది. మూడేళ్ల అవార్డులు ప్రకటించిన తీరు చూస్తుంటే ముందుగా ఎంపిక చేసిన సినిమాల లిస్టును ముఖ్యమంత్రికి సమర్పించినట్లు అర్థమవుతోంది’’ అని నిర్మాత చంటి అడ్డాల విమర్శించారు. ఇంకా మాట్లాడుతూ –‘‘మనం’ వంటి కుటుంబ కథాచిత్రం, ‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక సినిమా, ‘రేసుగుర్రం’ లాంటి కమర్షియల్‌ సినిమాతో పాటు ఎన్నో హిట్‌ సినిమాలున్నాయి.

అవార్డు తీసుకునే అర్హత వీటిలో దేనికీ లేదా? ‘సెలక్షన్‌ కమిటీ మన చేతిలో ఉంది కదా’ అని ఇష్టమొచ్చిన సినిమాలను ఎంపిక చేసి అవార్డులిచ్చేస్తే సినిమాలు తీయడమెందుకు? అవార్డుల ఎంపిక సమయంలో జ్యూరీలో తెలిసిన వ్యక్తిగానీ, ప్రభుత్వ పరిచయాలుగానీ, రెకమెండేషన్‌గానీ ఉండాలా? అనిపిస్తోంది. ఇకపైనా ఇలాగే కొనసాగితే నంది అవార్డు వృథా అనుకోవచ్చు. అప్పట్లో నేను చేసిన ‘ప్రేమ’ (2002) సినిమాకి నంది అవార్డు వచ్చిందని కెమెరామేన్‌ ఎస్‌. గోపాల్‌రెడ్డి ఫోన్‌లో చెప్పారు. కానీ, మరుసటి రోజు ఆ లిస్టులో మా సినిమా లేదు. రికమెండేషన్‌ ఉందని మరో సినిమాకి ఇచ్చారు. ఇక్కడ వ్యక్తిగత కాంపౌండ్‌లు ఉండకూడదు. ఉన్నది ఒక్కటే... అదీ సినిమా కాంపౌండ్‌’’ అన్నారు.

మరిన్ని వార్తలు