నాలుగిళ్లలో పాచిపనులు చేశా..

29 May, 2019 08:55 IST|Sakshi

ఆకలితో పస్తులున్న రోజులెన్నో..

పుష్కరాలు జీవితాన్నే మార్చాయి

నటిగా ఇప్పుడు అందరూ ఆదరిస్తున్నారు

ప్రముఖ నటి స్వప్న  

నలుగురు పిల్లలయిన తర్వాత కుటుంబ భారాన్ని తండ్రి అర్ధాంతరంగా వదిలి వెళ్లాడు. ఏ ఆధారమూ లేక ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు.. పరువు.. ప్రతిష్టలే ఆస్తులుగా భావించే తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక చిరుప్రాయంలోనే కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు.. ఇల్లు గడవడానికి నాలుగిళ్లలో పాచి పనులకు సిద్ధమైంది. ఇనుప గజ్జెల తల్లి కరాళ నృత్యం చేస్తూ ఉంటే.. పిడికెడు అన్నం ముద్ద దొరకని రోజులెన్నో చవిచూసింది. పంటి బిగువన ఆకలిని భరిస్తూ.. కుటుంబంలోని మిగిలిన సభ్యుల ఆకలిదప్పికలు తీర్చేందుకు శ్రమించింది. కష్టాల జీవితంలో ఊహించని మలుపు... భగవంతుడు ఇచ్చిన సహజ సిద్ధమైన ప్రతిభ.. ఆమెను గొప్ప నటిగా ఈ లోకానికి చాటి చెప్పింది. నేడు తెలుగు వారంతా మెచ్చుకునే నటిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న ఆమెనే.. స్వప్న. ఓ సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం అనంతపురానికి వచ్చిన ఆమెతో ‘సాక్షి చిట్‌చాట్‌’ మీ కోసం..  – అనంతపురం కల్చరల్‌

బాల్యమంతా రాజమండ్రిలోనే ..
నా బాల్యమంతా గోదావరి తల్లి ఒడ్డునే సాగింది. మాది రాజమండ్రిలోని చిన్నపాటి మధ్యతరగతి కుటుంబం. పెళ్లిళ్లకు డెకరేషన్లు చేస్తూ వచ్చే అరకొర సంపాదనతో మా నాన్న కుటుంబాన్ని పోషించేవారు. నాకు ఒక అక్క, చెల్లి ఉన్నారు.  తమ్ముడు వంశీ పుట్టగానే నాన్నతో గడిపే అవకాశం లేకుండా పోయింది. గంపెడంత సంసారాన్ని మోయడానికి అమ్మ పడిన కష్టం ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతూ ఉంది. గారాలు పోతూ అల్లరి చేయాల్సిన ఆ వయసులో మేము నాలుగైదు ఇళ్లలో పాచిపని కూడా చేశాం. దీనిని సెలబ్రెటీ అయినా గర్వంగా చెప్పుకోవడానికే ఇష్టపడతాను. ఎందుకంటే నైతిక విలువలకు కట్టుబడితే కష్టమనేది కనపడదు. కానీ పగవాళ్లకు కూడా మా కష్టం రాకూడదని కోరుకుంటా.

దరువే సెలబ్రెటీగా మార్చింది

మా ప్రాంతంలో పుష్కలంగా నీరున్నా..  సామాన్య కుటుంబాల వారు మాత్రం వీధి కుళాయి దగ్గరకెళ్లి బిందెలు వంతులు పట్టి తెచ్చేకోవాల్సిందే. నేనలా క్యూ లైన్లలో ఉంటూ బిందెపై కూర్చుని పాటలు పాడేదాన్ని. అదృష్టమేమిటంటే నా పాట, నా యాస అందరికీ నచ్చి మెచ్చుకునేవారు. ఓ వైపు చదువుకుంటూనే పాచి పనులు చేసుకుంటూ కష్టం తెలీయకుండా పాడుకునే యాల పదాలలో వారికేమి స్ఫూరించిందో కానీ, నేను ఓ మంచి స్టార్‌ అయ్యేలా మాత్రం చేసింది.  ఓ రోజు లక్ష్మీ మ్యూజికల్స్‌ అధినేత శ్రీనివాస్‌ అన్న నా టాలెంట్‌ను కళాప్రపంచానికి పరిచయం చేయడంతో నా దిశ తిరిగింది. అంతకు ముందు చర్చిల్లో మేము పాడే పాటలు విని తెగ మెచ్చుకునేవారు. జీసెస్‌ నా జీవితాన్ని ఇలా నడిపించాడనుకున్నా.

పుష్కరాలు జీవితాన్ని మార్చాయి
2000 సంవత్సరంలో జరిగిన గోదావరి పుష్కరాలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. స్వయంగా అప్పటి ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు నన్ను పిలిపించి యాంకరింగ్‌కు అవకాశమిచ్చారు. ఇది సామాన్య విషయం కాదు.  లక్షల జనం పోగవుతున్న వేళ తప్పిపోతున్న వారిని వాళ్ల ఆప్తుల దగ్గరకు చేర్చే విషయంలో యాంకర్లుగా మేము చాలా శ్రమించాం. తప్పిపోయిన వారిని ఆప్తుల వద్దకు చేర్చిన సమయంలో వారు చూపించిన కృతజ్ఞత నాలో మరో మనిషిని తట్టి లేపింది. అప్పుడే నిశ్చయించుకున్నా సేవలోనే జీవితమంతా గడపాలని.

ప్రతి సీరియలూ పేరు తెచ్చింది
బయటి ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన పుష్కరాలే.. ఆ తర్వాత టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశమూ తెప్పించాయి. అప్పుడు నా వాయీస్‌ విన్న చాలామంది మంచి అవకాశాలిచ్చారు. సినిమాలు ఇష్టం లేకపోయినా ఇంటి పరిస్థితులు నన్ను ఆ వైపు నడిపించాయి. ‘సినీ రంజనీ – మనోరంజనీ’లో తొలిసారి నటించాను. దూరదర్శన్‌తో పాటు పాటు పలు చానెళ్లు తీసిన సీరియల్స్‌లో ప్రధాన పాత్ర పోషించాను. ‘అమృతం’లో నేను నటించిన హాస్య పాత్ర నాలోని చలాకీతనాన్ని ఆవిష్కరించి అలాంటి పాత్రలు మరెన్నో తెచ్చిపెట్టింది. ‘చక్రవాకం, శిశిర వసంతం, స్వాతి చినుకులు, అపరంజి, తూర్పు వెళ్లే రైలు, మనసు–మమత, నా పేరు మీనాక్షి, అంజలి, ఊహల పల్లకి, చంద్రముఖి, ఇద్దరమ్మాయిలు, కల్పన’ ఇలా ప్రతి సీరియల్‌లోనూ నా పాత్ర  మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కథలో రాజకుమారి సీరియల్లో నటిస్తున్నా. 

అనంత ఆదరణ బాగుంది
టీవీ నటులకు ఆదరణ ఇంత గొప్పగా ఉంటుందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా గుర్తుపట్టి పలకరిస్తుంటారు. ఫ్యాన్స్‌ అసోసియేషన్లు పుట్టుకొచ్చాయి. మా పేరుపైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే చైతన్య త్యాగగుణం నచ్చి అనంతకొచ్చాను. అటువంటి సేవాభావమే మంచి సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది.  నా పేరుపైన ఓ ట్రస్టు అనంతపురంలో పుట్టడం నాకెంతో గర్వకారణంగా ఉంది. వారి ఆదరణకు, అభిమానానికి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను.  

సినిమాలంటే ఇష్టముండేది కాదు
నా వయసు వారు ఫుల్‌ఫ్యాషన్‌ ప్రపంచంలో విహరిస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలన్నా, టీవీలన్నా అస్సలు ఇష్టముండేది కాదు. మనమొకటనుకుంటే దైవం మరొకటి తలుస్తాడంటారు కదా అదే నిజమైంది నా విషయంలో. నా వాయిస్‌ బాగుంటుందని అందరూ మెచ్చుకుంటూ యాడ్‌ పబ్లిసిటీ కోసం డబ్బింగ్‌ చెప్పే అవకాశం ఇప్పించారు. ఎన్నిళ్లలో పనిచేసినా పదిహేను రూపాయలు మించి ఇచ్చేవారు కాదు. 2000 సంవత్సరంలో యాడ్స్‌లో నేను అందుకున్న తొలి పారితోషకం రూ.15లు! దానికే నేను ఎంతో పొంగిపోయాను. అలా సిటీ కేబుల్స్‌లో కనిపిస్తూ వచ్చా. నా టాలెంట్‌ ఏమిటో కూడా బయటపడిందే అక్కడే.  

వైఎస్సార్‌ను మిస్సయ్యాను
నా నట జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నా. ఆ క్రమంలోనే  ‘శిశిర వసంతం’ సీరియల్‌కు బెస్ట్‌యాక్ట్రస్‌గా తొలి అవార్డు దక్కింది. 2006లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డునందుకున్నా. అప్పుడు మా అభిమాన నాయకుడు, అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు ఆ కార్యక్రమానికి వస్తారని ఎంతో ఆశించా. పనుల ఒత్తిడి వల్ల ఆయన రాలేకపోయారు. తర్వాత నేనూ కలవక పోయా. ‘ఇద్దరమ్మాయిలు’కు కోహినూరు మహిళ, జాతీయస్థాయిలో లేడీ లెజండ్‌ అవార్డులు నన్నెంతగానో ప్రోత్సహించాయి. సినీనటులు ఉత్తేజ్, హర్షవర్ధన్, వేణుమాధవ్, సప్తగిరి, శంకర్‌ వంటి వారు హోమ్లీ పాత్రలకు నా పేరే సూచించడం ఆనందంగా ఉంది.

దేవతలా పూజించారు
తెలంగాణ ప్రాంతంలో ప్రజలు చాలా మంచిగా, అమాయకంగా ఉంటారు. నమ్మితే ప్రాణమిస్తారు. ‘ఎగిసే తారాజువ్వలు, అమ్మ నీకు వందనం, దేవదాసు (నాగార్జున, నానీ నటించిన కొత్త సినిమా), వజ్రకవచ, బ్రాండ్‌బాబు, గోవింద, మీనాక్షి’ సినిమాల్లో నటించాను. ‘చాకలి ఐలమ్మ, రేణుకా ఎల్లమ్మ’ సినిమాలు నాకు ఎంత పేరు తెచ్చిపెట్టాయంటే ఒకసారి నన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని ఏకంగా పూజలు చేశారు. నేను చాలా ఇబ్బందిగా ఫీలయ్యా. నేను సామాన్య నటిని అంటే తెలంగాణ పల్లెల ప్రజలు నమ్మినా వదల్లేదు. పిడికెడు అన్నం ముద్ద కోసం చేతులు చాచిన నేనేనా ఈ స్థాయికి చేరుకున్నదని అనిపించేది.  

పెళ్లి వద్దనుకున్నా
నాన్న లేకపోవడంతో కుటంబానికి ఆ స్థానం నేను తీసుకోవాలనుకున్నా. ముఖ్యంగా అమ్మను రాణిలా చూసుకోవాలన్నది నా జీవితాశయం. అక్కకు, చెల్లికి, తమ్మునికి పెళ్లిళ్లు చేశా. వాళ్ల పిల్లలకు కూడా నా చేతనైంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అయితే ఇన్ని బాధ్యతలకు పెళ్లి అడ్డుకాకూడదనే వద్దనుకున్నా. జీవితాంతం ‘నన్‌’ గా ఉండడానికే నిశ్చయించుకున్నా. సేవా కార్యక్రమాలలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదన్నది నా జీవితం నేర్పిన పాఠం. నాలా ఉండాలని నేను కోరుకోవడం లేదు కానీ యువతకు నేను చెప్పేదొక్కటే దేనికీ భయపడొద్దు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ముందే  రాసేసుకున్నాడు. అర్ధంతరంగా దానిని మార్చే ప్రయత్నం చేయొద్దు. విశ్వాసాన్ని కోల్పోతే టాలెంట్‌ కూడా నిస్సారం అవుతుంది. 

మరిన్ని వార్తలు