రేష్మీగౌతమ్ సరసన నటిస్తున్న విలన్

20 Jun, 2016 10:14 IST|Sakshi
రేష్మీగౌతమ్ సరసన నటిస్తున్న విలన్

లోఫర్ సినిమాలో విలన్‌గా చేసిన చరణ్‌దీప్ గుర్తున్నాడా? ఇంతకుముందు జిల్లాలో కూడా చేసిన ఇతడికి ప్రస్తుతం మంచి డిమాండు కనిపిస్తోంది. ఒకేసారి ఏకంగా ఆరు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఒక తెలుగు సినిమాలో మాత్రం పాజిటివ్ పాత్ర చేస్తూ.. రేష్మీగౌతమ్ సరసన కూడా నటిస్తున్నాడు. ఈ సంవత్సరం తనకు చాలా బిజీగా ఉందని, అయితే విజయాలు కూడా అలాగే వస్తున్నాయని చరణ్ దీప్ అంటున్నాడు. విశాల్ చేస్తున్న కత్తి సందై, సునీల్ హీరోగా వస్తున్న ఈడు గోల్డ్ ఎహ, ఇంకా వీరా, శరబ, నాను మత్తు వరలక్ష్మి, అంతమ్, మొట్ట శివ కెట్ట శివ.. వీటన్నింటిలోనూ చరణ్‌దీపే విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. వీటన్నింటిలో ఈడు గోల్డ్ ఎహ సినిమాలో పాత్ర చాలా బాగుంటుందని, అందులో తండ్రికి బాగా దగ్గరగా ఉండే ఎమోషనల్ విలన్‌గా చేస్తున్నానని అన్నాడు.

ఇక శరభ సినిమాలో అయితే.. ఇంతకుముందు అరుంధతిలో సోనుసూద్ చేసిన తరహా పాత్ర చేస్తున్నాడట. ఇది సోషియో ఫాంటసీ సినిమా అని, ఈ పాత్ర కోసం తాను పూర్తిగా మేకోవర్ చేయాల్సి వచ్చిందని అన్నాడు. కేవలం మేకప్ కోసమే రోజూ మూడుగంటలు పట్టిందని, ఇది తన కెరీర్‌లోనే చాలా ఛాలెంజింగ్ రోల్ అని తెలిపాడు. ఇక తెలుగులో వస్తున్న థ్రిల్లర్ మూవీ 'అంతం'లో వెరైటీగా పాజిటివ్ పాత్రలో చేస్తున్నాడు. ప్రతిసారీ విలన్‌ పాత్రల్లో కనపడే తనను పాజిటివ్ పాత్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుమానంగానే ఉందని చెప్పాడు. ఈ సినిమాలో అతడు రేష్మి గౌతమ్ సరసన నటిస్తున్నాడు.