కోలీవుడ్‌కు చరణ్‌రాజ్‌ వారసుడు

5 Apr, 2017 02:40 IST|Sakshi
కోలీవుడ్‌కు చరణ్‌రాజ్‌ వారసుడు

పలు భాషల్లో విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి తనదైన ముద్ర వేసుకున్న నటుడు చరణ్‌రాజ్‌.  ఆయన వారసుడు తేజ్‌ చరణ్‌రాజ్‌ కోలీవుడ్‌లో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన నటిస్తున్న చిత్రానికి లాలీ లాలీ ఆరారో అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆరుపడై మూవీ మేకర్స్‌ పతాకంపై ఆరుపడైయప్పన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను లింగన్‌రాజాళి నిర్వహిస్తున్నారు.

 శివాని కథానాయకిగా పరిచయం అవుతున్న ఇందులో మనోబాల, లక్ష్మీప్రియ మీనన్, షినాజ్, జీవారవి, విజయ్‌ టీవీ ఫేమ్‌ దివాకర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేకే ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగభూషణ్‌ ఛాయాగ్రహణం, రామ్‌గోపాల్‌ కృష్టన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎంఆర్‌ఎల్‌.మంజునాత్, రవికుమార్, ఎస్‌వీకే.బ్రదర్స్, సీ.దేవేంద్రరాజ్‌ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రం అని తెలిపారు.

అమ్మే లోకంగా జీవించే కొడుకు. తన కొడుకు కంటే గొప్పదేదీ లేదని భావించే తల్లి మధ్య కొడుకు ప్రేమికురాలు ప్రవేశిస్తే వారి మనోభావాలు ఎలా ఉంటాయి? అదే విధంగా తన తండ్రి కంటే ఈ లోకంలో గొప్పవాడెవరూ లేరనే భావనతో జీవించే కూతురు, కూతురే జీవితంగా భావించే తండ్రికి మధ్య కొత్తగా కూతురి ప్రియుడు వస్తే జరిగే పరిణామాలేమిటన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో కూడిన చిత్రం లాలీ లాలీ ఆరారో అని చెప్పారు.

ప్రేమ, సెంటిమెంట్‌ సన్నివేశాలతో కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా ఉండే ఈ చిత్ర షూటింగ్‌ను నాగర్‌కోవిల్, కేరళా ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు తెలిపారు. చిత్ర ఆడియోను తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 14 విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.