జర్నలిస్ట్ నిశ్చలగా చార్మి

27 Jul, 2013 03:48 IST|Sakshi
జర్నలిస్ట్ నిశ్చలగా చార్మి
 ‘‘నాలుగేళ్ల క్రితం ఒరిస్సాలో ఓ అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఆ అమ్మాయి ఇంకా కోమాలోనే ఉంది. ప్రధానంగా ఆ రేప్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. ఆరేడేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రతిఘటన’. నిర్మాత కూడా ఆయనే. చార్మి కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 
 
 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘టీవీల్లో వస్తున్న వార్తలను చూసినప్పుడు, వార్తాపత్రికల్లోని వార్తలను చదివినప్పుడు ఇలాంటి నాయకుల్నా మనం గెలిపించింది? అని బాధ కలుగుతోంది. మనం ఓట్లు వేసి గెలిపిస్తున్న నాయకులు అసెంబ్లీలో, పార్లమెంట్‌లో కొట్టుకుంటున్నారు.
 
  ఎమ్మెల్యే, ఎంపీల్లో ఏడువందల మందికి పైగా అభియోగాలున్నాయి. మనల్ని పాలించేది వీళ్లా? అనిపిస్తోంది. ప్రస్తుత ఈ పరిస్థితులు, ఒరిస్సాలో జరిగిన రేప్ సమాహారంతో ఈ సినిమా ఉంటుంది. వాణిజ్య అంశాలు మేళవించిన పొలిటికల్ సెటైరికల్ సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఇందులో న్యాయం కోసం పోరాడే జర్నలిస్ట్ నిశ్చల పాత్రను చేస్తున్నాను. 
 
 సమాజంలో జరిగే అన్యాయాలను ధైర్యంగా ప్రశ్నించే పాత్ర నాది’’ అని చార్మి చెప్పారు. నాటి ‘ప్రతిఘటన’ విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నానని రఘుబాబు అన్నారు. మంచి మాటలు రాయడానికి ఆస్కారం ఉన్న కథ అని లక్ష్మీభూపాల్ చెప్పారు. ఇంకా ఎస్. గోపాల్‌రెడ్డి, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.