చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు టైముందట!

12 Aug, 2017 00:12 IST|Sakshi
చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు టైముందట!

ఆల్మోస్ట్‌ ఇంకో ఏడాది టైముందట.. అల్లు అర్జున్‌ చెన్నై ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడానికి! నిజం చెప్పాలంటే... ఈ టైమ్‌కి అల్లు అర్జున్‌ ఎక్కేయాలి. ఒకానొక దశలో అసలు చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను క్యాన్సిల్‌ చేశారనే మాటలూ వినిపించాయి. అయితే... అటువంటిదేం లేదట. చెన్నై ఎక్స్‌ప్రెస్‌ అంటే ట్రైన్‌ కాదు, తమిళ సినిమా.

అల్లు అర్జున్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా తెలుగు–తమిళ సినిమా ఒకటి ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలో అట్టహాసంగా ప్రారంభోత్సవమూ జరిగింది. నిజానికి, ‘దువ్వాడ జగన్నాథమ్‌’ తర్వాత బన్నీ–లింగుస్వామి సినిమా షూట్‌ మొదలవ్వాలి. కానీ, వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ప్రారంభించారు బన్నీ. మరోపక్క విశాల్‌ హీరోగా తమిళంలో ‘సండైకోళి–2’ ప్రారంభించారు లింగుస్వామి

. తెలుగులో మంచి విజయం, విశాల్‌కు గుర్తింపు సాధించిన ‘పందెం కోడి’కి సీక్వెల్‌ ఇది. మరి, ముందుగా ప్రకటించిన బన్నీ సినిమా సంగతేంటి? అంటే... ‘‘తప్పకుండా ఆ సినిమా ఉంటుంది. ‘నా పేరు ఇండియా–నా ఇల్లు ఇండియా’ పూర్తయిన తర్వాత బన్నీ ఆ సినిమా స్టార్ట్‌ చేస్తారు. ఈలోపు లింగుస్వామి ‘సండైకోళి–2’ పూర్తి చేసి వస్తారు. ఆల్రెడీ బన్నీ–లింగుస్వామిలు ఎప్పుడో స్క్రిప్ట్‌ను లాక్‌ చేశారు’’ అని గీతా ఆర్ట్స్‌ సన్నిహిత వర్గాల సమాచారం.