యాసిడ్‌ బాధితులకు పెన్షన్‌ ఇస్తాం

12 Jan, 2020 11:34 IST|Sakshi

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర మంత్రి రేఖా ఆర్య

విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ‘ఛపాక్‌’ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఛపాక్‌ ఇప్పుడు అసలు సిసలైన విజయాన్ని ముద్దాడబోతోంది. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘ఛపాక్‌’. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే అద్భుత నటనను ప్రదర్శించింది. జనవరి 10న విడుదలైన ఈ సినిమా సగటు ప్రేక్షకునితోపాటు ఓ ప్రభుత్వాన్ని సైతం కదిలించింది.

యాసిడ్‌ బాధితుల కోసం పెన్షన్‌ అందిస్తామని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించడమే దీనికి నిదర్శనం. ఈ మేరకు ఆ రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య మాట్లాడుతూ.. యాసిడ్‌ బాధితులు సగౌరవంగా బతికేందుకు వారికి ప్రతినెల రూ.5000 నుంచి రూ.6000 అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్‌లో ప్రతిపాదన తీసుకొస్తామని, అది ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సహాయం ద్వారా ధీర వనితలు వారి ఆశయాలను సాధించడంలో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు ఈ సినిమాకు వినోదపు పన్నును మినహాయించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఛపాక్‌ మూవీ రివ్యూ)

మరిన్ని వార్తలు