పడి లేచిన కెరటంలా యాసిడ్‌ బాధితురాలు

10 Dec, 2019 14:43 IST|Sakshi
యాసిడ్‌ బాధితురాలి పాత్రలో దీపికా పదుకునే

దాదాపు 14 సంవత్సరాల క్రితం.. దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీ అగర్వాల్‌పై యాసిడ్‌ దాడి జరిగింది. ‘ప్రేమ’ను నిరాకరించిందనే కోపంతో అందరూ చూస్తుండగానే ఆమెపై యాసిడ్‌ దాడి చేశాడో దుర్మార్గుడు. అతడి అకృత్యానికి లక్ష్మీ ముఖం, మెడ భాగం పూర్తిగా కాలిపోయాయి. ఎన్నో సర్జరీల అనంతరం కోలుకున్న ఆమె మనో నిబ్బరంతో ముందడుగు వేసింది. తనలాంటి బాధితులకు అండగా నిలిచింది. తాజాగా లక్ష్మీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం చపాక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలి పాత్రలో నటిస్తున్న దీపికా పదుకునే తొలిసారిగా నిర్మాత బాధ్యతలు కూడా చేపట్టారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నేడు ‘ఛపాక్‌’ ట్రైలర్‌ రిలీజైంది.

యాసిడ్‌ బాధితురాలిగా మాలతి (లక్ష్మీ) ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, తనలాంటి అభాగ్యులకు న్యాయం అందేందుకు ఆమె చూపించిన తెగువ ట్రైలర్‌లో స్పష్టంగా కన్పిస్తోంది. యాసిడ్‌ దాడి అనంతరం వికృతంగా మారిన తన ముఖాన్ని అద్దంలో చూసుకుని మాలతి భయపడి రోదించడం మనసుల్ని కలిచివేసేదిగా ఉంది. ముఖం ఎదుటివారికి చూపించడానికి కూడా ఇష్టపడని మాలతి.. కొంత కాలం తర్వాత దుపట్టా ఎగరేసి స్వేచ్ఛగా తిరిగే స్థాయికి ఎలా ఎదిగిందో తెలుసుకోవాలంటే ‘ఛపాక్‌’ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. 

మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాధతో కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన లక్ష్మీ పాత్రలో నటించిన దీపికను నెటిజన్లు కొనియాడుతున్నారు. ట్రైలర్‌ చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘అమ్మాయిలు ముఖంపై వచ్చే మొటిమలనే సహించరు.. అలాంటిది ఆమె యాసిడ్‌ బాధను ఎలా భరించారో’ అంటూ ఓ నెటిజన్‌ భావోద్వేగంగా కామెంట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు