ప్చ్‌: చైనాలో బాహుబలి-2 కలెక్షన్లు కూడా..!

7 May, 2018 17:38 IST|Sakshi

దర్శకదీరుడు రాజమౌళి దృశ్యకావ్యం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ భారీ అంచనాలతో చైనాలో విడుదలైంది. బాహుబలి మొదటి పార్టు చైనాలో ఫెయిల్‌ కావడంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని.. చిత్రబృందం పొరుగుదేశంలో గతవారం ఈ సినిమాను విడుదల చేశారు. చైనీయుల అభిరుచికి తగినట్టు మార్పులు చేసినప్పటికీ.. బాహుబలి-2 సినిమా అక్కడి సినీ ప్రేమికులను ఆకట్టుకోలేకపోయింది. తొలిరోజు ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. దీంతో చైనాలోనూ బాహుబలి ప్రభంజనం ఖాయమని భావించారు. కానీ, ఆ తర్వాతి రోజుల్లో ప్రేక్షకులను థియేటర్ల వైపునకు రప్పించడంలో ఈ సినిమా విఫలమైంది. మొత్తంగా మొదటి మూడురోజుల్లో బాహుబలి-2 రూ. 51.20 కోట్లు వసూలు చేసిందని తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. గతంలో మొదటి వీకెండ్‌లో ఆమిర్‌ ఖాన్‌ సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ రూ. 173.82 కోట్లు వసూలుచేస్తే.. ఇర్ఫాన్‌ ఖాన్‌ హిందీ మీడియం సినిమా రూ. 102.18 కోట్లు రాబట్టింది. కానీ బాహుబలి-2 మాత్రం మొదటివారంలో ఆశించినంత వసూళ్లు రాబట్టలేకపోయింది.

‘చైనాలో బాహుబలి-2 ఆశించినంత వసూళ్లు రాబట్టడం లేదు. శుక్రవారం 2.43 మిలియన్‌ డాలర్లు రాబట్టిన ఈ సినిమా శనివారం 2.92 మిలియన్‌ డాలర్లు, ఆదివారం 2.26 మిలియన్‌ డాలర్లు.. మొత్తంగా 7.63 మిలియన్‌ డాలర్లు (రూ. 51.20 కోట్లు) వసూలు చేసింది’ అని తరణ్‌ ట్వీట్‌ చేశారు.

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో భారీగా రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో రెండో భాగం విషయంలో చిత్రయూనిట్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను మరోసారి ఎడిటింగ్‌ చేయించారు. అంతేకాదు ఏకంగా 7వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను రిలీజ్‌ చేశారు.

బాహుబలి నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు తొలిరోజు ఫలించినట్టు కనిపించినా.. ఆ తర్వాత మాత్రం కలెక్షన్లు ఊపందుకోలేదు. అయితే, బాహుబలి తొలి భాగం చైనాలో ఫుల్‌ రన్‌లో సాధించిన 1.18 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లను.. బాహుబలి 2 తొలి రోజే సాధించింది.

>
మరిన్ని వార్తలు