మరో షాకిచ్చిన చిన్మయి

2 Dec, 2018 07:50 IST|Sakshi

నటుడు రాధారవితో తాడో పేడో తేల్చుకోవడానికి గాయని చిన్మయి సిద్ధం అయినట్టున్నారు. రాధారవి, ప్రముఖ సీనియర్‌ నటుడు, దక్షిణ భారత బుల్లితెర, సినీ డబ్బింగ్‌ కళాకారుల సంఘం అధ్యక్షుడు అన్న విషయం తెలిసిందే. ఇక గాయని చిన్మయి డబ్బింగ్‌ కళాకారుల సంఘంలో సభ్యురాలు కూడా. ఆమె నటి త్రిష వంటి ప్రముఖ నటీమణులకు గొంతును అరువిస్తుంటారు.

అయితే ఇటీవల రాధారవికి చిన్మయికి మధ్య బహిరంగ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో మీటూకు ప్రాబల్యం తీసుకొచ్చింది చిన్మయినే అని చెప్పవచ్చు. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించి సంచలనం పుట్టించిన చిన్మయి నటుడు రాధారవిని వదలలేదు.

దీంతో చిన్మయి ఆరోపణల్లో నిజం లేదంటూ కొట్టిపారేసిన రాధారవి అంతటితో ఊరుకోకుండా, ఆమెను డబ్బింగ్‌ కళాకారుల సంఘం నుంచి తొలగించారు. అందుకు చిన్మయి రెండేళ్లుగా సంఘ వార్షిక సభ్యత్వ రుసుంను చెల్లించలేదన్నది సాకుగా చూపారు. అందుకు చిన్మయి ఘాటుగానే స్పందించారు.

మీటూ ఆరోపణ కారణంగానే రాధారవి తనను సంఘం నుంచి తొలగించారని, అయినా తన సభ్యత్వాన్ని రద్దు చేయడం ఆయనకు సాధ్యం కాదని, తాను శాశ్వత సభ్యురాలినని పేర్కొన్నారు. తాజాగా రాధారవికి మరో షాక్‌ ఇచ్చారు. రాధారవికి మలేషియా ప్రభుత్వం డటోక్‌ అనే ఆ దేశ ప్రతిష్టాత్మకమైన బిరుదుతో సత్కరించిందట.

దీంతో ఆయన పేరు ముందు డటోక్‌ అపే బిరుదును తగిలించుకున్నారు. ఈ బిరుదు వెనుక గుట్టును గాయని చిన్మయి బయట పెట్టారు. ఈ బిరుదుపై మలేషియా ప్రభుత్వానికి చిన్మయి లేఖ రాసి నిజానిజాలు తెలిపాల్సిందిగా కోరారు. 

చిన్మయి లేఖకు స్పందించిన ఆ దేశ ప్రభుత్వం రాధారవికి తమ ప్రభుత్వం డటోక్‌ బిరుదును అందించిన దాఖలాలు లేవని, అసలు భారతదేశానికి సంబంధించి ఒక్క నటుడు షారూక్‌ఖాన్‌కు మినహా మరెవరికీ ఆ బిరుదును అందించలేదనిపేర్కొంది. ఈ విషయాన్ని గాయని చిన్మయి శనివారం తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి రాధారవి డటోక్‌ పట్టం నకిలీ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మరి దీనికి రాధారవి స్పందన ఎలా ఉంటుందో?

మరిన్ని వార్తలు