‘చినబాబు’ మూవీ రివ్యూ

13 Jul, 2018 12:35 IST|Sakshi

టైటిల్ : చినబాబు
జానర్ : ఫ్యామిలీ డ్రామా
తారాగణం : కార్తీ, సయేషా, సత్యరాజ్‌, సూరి, శత్రు
సంగీతం : డి ఇమాన్‌
దర్శకత్వం : పాండిరాజ్‌
నిర్మాత : సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తన ప్రతీ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న కార్తీ, తాజాగా చినబాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పల్లెటూరి కథతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కార్తీ అన్న, కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య నిర్మించటం విశేషం. మరి అన్నదమ్ములు కలిసి చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా..? కార్తీ తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించాడా..?

కథ;
పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్‌) రైతు. ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్న పెద్ద కుటుంబ యజమాని. ఎప్పటికైనా తన కూతుళ్లు, అల్లుల్లు.. వాళ్ల పిల్లలను ఇంటికి పిలిచి అందరితో కలిసి ఓ ఫ్యామిలీ ఫొటో తీయించుకోవాలని ఆశపడుతుంటాడు. రుద్రరాజు కొడుకు కృష్ణంరాజు (కార్తీ) ‘రైతే దేశానికి ఆధారం’ అని నమ్మే ఆదర్శ రైతు. రుద్రరాజు ఇద్దరు కూతుళ్లు తమ అమ్మాయిలను కృష్ణంరాజు కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కృష్ణంరాజు, నీల నీరధ(సయేషా)ను ఇష్టపడతాడు. (సాక్షి రివ్యూస్‌) దీంతో కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. అదే సమయంలో నీల నీరధ బావ, సురేంద్ర రాజు (శత్రు)ను ఓ హ్యతకేసులో కృష్ణం రాజు అరెస్ట్‌ చేయిస్తాడు. దీంతో ఎలాగైన ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో సురేంద్ర, రుద్రరాజు కుటుంబంలో మొదలైన గొడవలు మరింత పెద్దవి చేసి అందరిని విడదీయాలని, కృష్ణంరాజును చంపాలని ప్రయత్నిస్తాడు. ఈ సమస్యల నుంచి కృష్ణంరాజు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు..? ఎలా తిరిగి ఒక్కటి చేశాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
రైతు పాత్రలో కార్తీ జీవించాడు. ఆదర్శ రైతుగా, కుటుంబం కోసం ప్రాణమిచ్చే పల్లెటూరి యువకుడి పాత్రలో కార్తీ నటన సూపర్బ్‌. కామెడీ టైమింగ్‌, ఎమోషనల్‌ సీన్స్‌, రొమాంటిక్‌ సీన్స్‌, యాక్షన్‌ ఇలా ప్రతీ విషయంలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ సయేషాది దాదాపుగా అతిథి పాత్రే. ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. గత చిత్రాల్లో మోడ్రన్‌ అమ్మాయిగా కనిపించిన సయేషా పల్లెటూరి అమ్మాయిగానూ మెప్పించింది. (సాక్షి రివ్యూస్‌) కుటుంబ పెద్దగా సత్యరాజ్‌ హుందాగా కనిపించారు. తెలుగులో సపోర్టింగ్ రోల్స్‌ లో కనిపించిన శత్రుకు ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌గా అవకాశం దక్కింది. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైన చేసే పాత్రలో శత్రు మంచి విలనిజం పండించాడు. అక్కలు, బావల పాత్రలలో నటించిన వారంతా తమిళ నటులే కావటంతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావటం కాస్త కష్టమే.

విశ్లేషణ ;
మాస్ ఆడియన్స్‌లో మంచి పట్టున్న కార్తీని పల్లెటూరి రైతు బిడ్డగా చూపించాడు దర్శకుడు పాండిరాజ్‌. మాస్ కమర్షియల్‌, ఎలిమెంట్స్‌ మిస్‌ అవ్వకుండా, బలమైన ఎమోషన్స్‌ తో కథను నడిపించాడు. కార్తీ నుంచి ఫ్యాన్స్ ఆశించిన కామెడీ, రొమాన్స్ లాంటి అంశాలకు లోటు లేకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే సినిమా పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. నేటివిటి పరంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. (సాక్షి రివ్యూస్‌)నటీనటులు అంతా తమిళ వారే కావటం కూడా ఇబ్బంది పెడుతుంది. వేల్‌రాజ్‌ సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా తెర మీద చూపించారు. ఇమాన్‌ సంగీతమందించిన పాటలు పరవాలేదనిపించినా..  ఎమోషనల్‌ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత బలాన్నించింది. ఎడిటింగ్ బాగుం‍ది. సూర్య కథ మీద నమ్మకంతో తమ్ముడి కోసం భారీగానే ఖర్చు చేసి సినిమాను నిర్మించారు.

ప్లస్‌ పాయింట్స్‌ ;
ఫ్యామిలీ ఎమోషన్స్‌
ప్రధాన పాత్రల నటన

మైనస్‌ పాయింట్స్‌ ;
నేటివిటి
ప్రధాన పాత్రల్లో తమిళ నటులే కనిపించటం

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.
           

Poll
Loading...
మరిన్ని వార్తలు