మంచి ప్రయత్నం : చిరంజీవి

26 Oct, 2015 00:53 IST|Sakshi
మంచి ప్రయత్నం : చిరంజీవి

‘‘ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ‘కంచె’ చూడ్డానికి వెళ్లాను. చూశాక ఇంటికి పిలిపించి చిత్రబృందాన్ని అభినందించాలనిపించింది. సినిమా ఆద్యంతం హృద్యంగా సాగింది. ఇది ఒక విజయవంతమైన ప్రయత్నం’’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. క్రిష్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ‘కంచె’ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
 
 చిరంజీవి మాట్లాడుతూ- ‘‘పల్లె వాతావరణాన్ని ఎంత కళ్లకు కట్టినట్లు చూపించారో, రెండో ప్రపంచ యుద్ధం నాటి వార్ సీక్వెన్సెస్‌ను కూడా అంతే గొప్పగా ఆవిష్కరించారు. జార్జియాలో తీసిన వార్ సీన్స్ చూసి వంద రోజుల పాటు తీసుంటారేమో అనుకున్నా. కేవలం 55 రోజుల్లో మొత్తం  సినిమా తీశారని తెలుసుకుని ఆశ్చర్యపోయా. హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఈ సినిమా ఉంది. వరుణ్ ఈ సినిమాలో 1940ల్లో నాటి  హీరోలాగానే కనిపించాడు. సైనికుడిగా, పల్లె యువకునిగా ఒదిగిపోయాడు. సాయిమాధవ్ రాసిన  సంభాషణలు చాలా అందంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.  అందరూ దీన్ని ఓ క్లాసిక్ అనుకుంటున్నారు కానీ ఇది అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా.
 
  ఇదో మంచి ప్రయత్నం’’ అన్నారు. క్రిష్ మాట్లాడుతూ- ‘‘చిరంజీవి లాంటి అగ్ర నటుడు నా సినిమాలోని ప్రతి డైలాగ్‌ను గుర్తుపెట్టుకుని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మా నాన్నగారి పుట్టినరోజు. ఆయనకు విషెస్ చెప్పి, చిరంజీవిగారిని కలవడానికి వెళుతున్నానని చెప్పగానే  ఒకే మాట అన్నారు. నువ్వు ‘గమ్యం’ తీసినప్పుడు నాకు ఇంత ఆనందం కలగలేదు. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది అని నన్ను హగ్ చేసుకున్నారు. అమ్మకి, నాన్నకి, పుడమికి, పుస్తకానికి నమస్కరిస్తూ  అంటూ సినిమా స్టార్ట్ చేశాను. ఈసారి నుంచి మాత్రం తెలుగు ప్రేక్షకులకు సెల్యూట్ చేస్తూ నా మిగతా సినిమాలు తీస్తాను’’ అని చెప్పారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా