హిట్‌ సినిమా హక్కులు కొన్న చిరంజీవి

2 Oct, 2019 16:14 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’  ప్రేక్షకుల ముందు వచ్చిన నేపథ్యంలో ఆయన తర్వాతి సినిమా ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. కొరటాల శివ దర్శకత్వంలో ఇంతకుముందే సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ సినిమా రీమేక్‌ హక్కులను కూడా చిరంజీవి సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల చిరంజీవి కేరళలో పర్యటించారు. పృథ్విరాజ్‌ నటన అంటే తనకు చాలా ఇష్టమని, సైరాలో నటించమని ఆయనను కోరినట్టు ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించారు. సైరాలో నటించలేకపోయినందుకు పృథ్విరాజ్‌ వినమ్రంగా సారీ చెప్పారు. ‘చిరంజీవి రత్నం లాంటి మనిషి. ఆయనతో కలిసి  సైరా ప్రచారంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. మానవత్వం, మంచితనం మూర్తీభవించిన మనిషి ఆయన. లూసిఫర్‌ సినిమా రీమేక్‌ హక్కులు మీరు కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. సైరాలో నటించేందుకు మీరిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేనందుకు మన్నించాలి’ అంటూ పృథ్విరాజ్‌ ట్వీట్‌ చేశారు.

లూసిఫర్‌ సినిమా మలయాళంలో సంచలన విజయం సాధించింది. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మురళీ గోపీ కథను పృథ్విరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కించారు. కేరళలో రాజకీయ అనిశ్చితి సందర్భంగా ఓ కుటుంబంలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో మోహన్‌లాల్‌ రాజకీయ నాయకుడిగా నటించారు. లూసిఫర్‌ విజయవంతం కావడంతో ‘ఎంపురాన్‌’ పేరుతో దీనికి సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నారు. మూడో పార్ట్‌ కూడా ఉంటుందని సమాచారం. (చదవండి: సైరా హిట్‌.. మెగా ఫ్యామిలీ సంబరం)
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా