దాసరి నాకు తాత అవుతారు

5 May, 2019 03:52 IST|Sakshi
శంకర్, రాఘవేంద్రరావు, అజయ్‌ భూపతి, చిరంజీవి, వేణు ఉడుగుల, వెంకీ కుడుముల, వెంకటేశ్‌ మహా

– చిరంజీవి

‘‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఎంతో మంది దర్శకుల శ్రమ ఫలితం వల్లే ఓ హీరో రూపుదిద్దుకుంటాడు. ఎంతో గొప్ప ప్రతిభా పాటవాలున్న దాసరిగారి జన్మదినం రోజుని ‘డైరెక్టర్స్‌ డే’గా ప్రకటించి, జరుపుకోవటం నిజంగా దర్శకుల అదృష్టం’’ అన్నారు నటుడు చిరంజీవి. మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి. ఈ సందర్భంగా శనివారం తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో ‘డైరెక్టర్స్‌ డే’ వేడుక జరిగింది. ఇందులో దాదాపు 300 మంది దర్శకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు.

2018లో మంచి చిత్రాలను అందించిన నలుగురు దర్శకులను ఈ వేదికపై సన్మానించారు. చిరంజీవి చేతుల మీదుగా ‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఉడుగుల, ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల, ‘కేరాఫ్‌ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్‌ మహా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతి సన్మానాలు అందుకున్నారు. ఇవే కాకుండా  ‘ఫోర్స్‌డ్‌ ఆర్ఫన్స్‌’ అనే ఇంగ్లీష్‌ షార్ట్‌ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించి అవార్డులు అందుకున్న వీఎన్‌ ఆదిత్యను, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ గారిపై ‘విశ్వదర్శనం’ చిత్రానికి దర్శకత్వం వహించి, ఇటీవల దాదాసాహెబ్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డు పొందిన జనార్థన మహర్షిని కూడా సన్మానించారు.

చిరంజీవి మాట్లాడుతూ– ‘‘1940ల కాలం నుండి ఎంతోమంది దర్శకులు ఉన్నారు.  నేను నటునిగా మేకప్‌ వేసుకున్న దగ్గరనుండి ఈ రోజు వరకు ఎంతో మంది దర్శకులను చూశాను. కానీ దాసరిగారి శైలి చాలా ప్రత్యేకమైనది. నాకు ఆయనతో సినిమా పరిచయం అయింది ‘లంకేశ్వరుడు’ ద్వారా. ఆయన దర్శత్వంలో నేను చేసిన ఒకే ఒక్క సినిమా. అది ఆయనకు వందో చిత్రం. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు, నాకూ ఒక్క సినిమా పరిచయమే అయినా మా ఇద్దరికీ దగ్గరి బంధుత్వం ఉంది. అది చాలా కొద్దిమందికే తెలుసు. ఆయన వరసకు నాకు తాత అవుతారు. నేను ఆయనకు మనవడిని అవుతాను. అందుకే నేనెప్పుడూ ఆయనతో ‘మీ మొదటి సినిమా తాతా మనవడు.

మీరు, నేను తాతామనవలం’ అనేవాణ్ణి. నేను 9 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత రాజకీయాల నుండి మళ్లీ సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో ఉత్సాహాన్నిచ్చారు. ‘ఖైదీ నంబర్‌ 150’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు రోడ్‌ జర్నీ చేసుకుంటూ వచ్చి ఆ సభలో ప్రసంగించారు. 150 ఘనవిజయం సాధిస్తుందని సభా ముఖంగా అన్నారు.. దాసరిగారు అన్నట్లుగానే ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పటికే ఆయన ఆరోగ్య స్థితి విషమించి ఆస్పత్రిలో చేరారు. నేను, మా ఆవిడ ఆయన్ను చూడ్డానికి వెళితే అంత ఇబ్బందికర పరిస్థితిలోనూ ‘సినిమా ఎలా ఉంది?’ అని పేపర్‌ మీద రాస్తూ అడిగారు.

తర్వాత ఆయనకు అల్లు రామలింగయ్య అవార్డును ప్రకటించి నేను, అల్లు అరవింద్‌ ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా అవార్డును అందజేస్తే ఎంతో చిన్న పిల్లాడిలా ఆనందపడిపోయి, ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ విధంగా ఆయన ఆఖరి రోజుల్లో నేను చాలా దగ్గరగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘దాసరి పుట్టినరోజున నిర్వహించే ఈ సభలో బొకేలు, శాలువాల ఖర్చులు కూడా వద్దు. మన దగ్గర గతంలో పనిచేసిన దర్శకులకు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో ఆలోచించి దర్శకులందరం ఓ నిర్ణయం తీసుకున్నాం. గతంలో దర్శకులుగా చేసి ఈ రోజున పిల్లలని చదివించుకోవటానికి కూడా లేకుండా ఇబ్బంది పడే అనేక మంది దర్శకులు ఉన్నారు. వారి సహాయార్థం ఓ నిధిని ఏర్పాటు చేయాలని ఓ నిర్ణయం తీసుకున్నాం.

దాదాపు ఐదు కోట్ల నుంచి పది కోట్ల మధ్యలో వసూలు చేసి, నెలకు ఓ ఐదు వేల రూపాయల చొప్పున ఓ యాభై మంది నుండి వంద మంది వరకు సహాయం చేయాలనుకుంటున్నాం. ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి ఎంతో మంచి మనసుతో యాభై లక్షల విరాళాన్ని తన వంతుగా అందించారు. నేను దర్శకునితో పాటు నిర్మాతని. బాహుబలి’ నిర్మాతల తరపున పదిహేను లక్షలు, నేను సొంతంగా పది లక్షలు ఇస్తున్నాం’’ అని చెప్పారు. మంచి మనసుతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఓ ఇరవై ఐదు లక్షలు తాను ఇస్తానని చిరంజీవి ప్రకటించారు.  ఈ వేదికపై మొత్తంగా కోటి రూపాయల విరాళం అందడం ఆనందంగా ఉందని దర్శకుల సంఘం అధ్యక్షుడు యన్‌. శంకర్‌ అన్నారు. ఎ. కోదండ రామిరెడ్డి, రేలంగి నరసింహారావు, ఆర్‌. నారాయణమూర్తి, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, కొరటాల శివ, వీర శంకర్, హరీష్‌ శంకర్, అనిల్‌ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. పలువురు దర్శకులు స్కిట్లు చేసి అలరించారు. దర్శకుల సంఘం వెబ్‌సైట్‌ని ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు