‘సైరా’తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

3 Oct, 2019 09:14 IST|Sakshi

‘సచిన్‌ సెంచరీ కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడు.. మెగాస్టార్‌ చిరంజీవి బాక్సాఫీస్‌ బద్దలుకొట్టుడు సేమ్‌ టు సేమ్‌’అంటూ మెగా అభిమానులు థియేటర్ల ముందు తెగ సందడి చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటించిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. గాంధీ జయంతి కానుకగా నిన్న(అక్టోబర్‌ 2)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘సైరా’ సినిమా విడుదలైన ప్రతీ చోట హిట్‌ టాక్‌తో భారీ కలెక్షన్ల దిశగా దూసుకపోతోంది. దసరా సెలవులు కావడంతో పాటు క్రిటిక్స్‌ కూడా ‘సైరా’  చరిత్ర తిరగరాస్తుందని పేర్కొనడంతో రానున్న రోజుల్లో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రామ్‌ చరణ్‌ నిర్మాతగా రెండో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. 

‘సైరా’తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సుమారు రూ.85 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగురాష్ట్రాలు మినహా దక్షిణాదిలో రూ. 32 కోట్లు, ఉత్తరాదిలో రూ. 35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 28 కోట్ల మేర వసూలు రాబట్టినట్లు సమాచారం. ఓవరాల్‌గా రూ. 180 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.106 కోట్ల మేర జరిగింది. నైజాంలో రూ.28 కోట్లు, సీడెడ్‌లో రూ.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.15 కోట్ల మేర బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రీరిలీజ్‌ బిజినెస్‌తో పాటు, తొలి రోజు కలెక్షన్లను గమనిస్తే ఒకటి రెండు రోజుల్లోనే రికార్డులను తిరగరాసి, లాభాల బాట పట్టే అవకాశం ఉంది. అయితే ‘సైరా’ తొలిరోజు కలెక్షన్లు అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు