‘సైరా’ ఫస్ట్‌ రివ్యూ: రోమాలు నిక్కబొడిచేలా చిరు నటన

1 Oct, 2019 12:25 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే సినిమా థియేటర్లలో విడుదల కాకముందే తొలి టాక్‌ వచ్చేసింది. యూఏఈ సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఉమైర్‌ సంధు ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూను ట్విటర్‌లో తనదైన రీతిలో పోస్ట్‌ చేశాడు. ‘సైరా’మామూలుగా లేదంటూ అతడు పేర్కొనడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సంధు తన రివ్యూలో ఏం పేర్కొన్నాడంటే..

రోమాలు నిక్క పొడిచాయి
‘సైరా’ చూస్తున్నంత సేపు మీ రోమాలు నిక్కపోడుచుకోవడం ఖాయం. సినిమాలో కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ గుండెలను హత్తుకునేలా ఉన్నాయి. నిజజీవిత కథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కించడంతో సినిమాలో మనం లీనమవుతాం. తరువాత ఏంటి అని ఆత్రుతగా ఎదురు చూస్తాం. మనకు తెలిసిన, తెలియని స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ విషయంలో దర్శకుడు సురేందర్‌ రెడ్డి విజయవంతం అయ్యారు. ఈ సినిమాతో సురేందర్‌ రెడ్డి చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేదీ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో దుమ్ములేపారు.

చిరంజీవి నటనకు హ్యాట్సాఫ్‌..
చిరంజీవి హీరోగా నటించిన 150 చిత్రాలు ఒక ఎత్తు అయితే ‘సైరా’మరొక ఎత్తు. తొలిసారి చారిత్రక సినిమాలో నటించి చిరంజీవి.. సరికొత్త చరిత్రను లిఖించనున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి నటన అద్భుతం.. జాతీయ ఆవార్డే చిరంజీవి కోసం వేచి చూసేలా నటించారు. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవడం ఖాయం. చిరంజీవి లుక్స్‌ కూడా కొత్తగా.. సినిమాకు యాప్ట్‌ అయ్యే విధంగా ఉన్నాయి. ఇక అచ్చం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డినే తెరపై చూసినట్టు అనిపించేలా చిరంజీవి నటించారు. మెగాస్టార్‌ నటనకు ప్రతీ ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. అంతేకాకుండా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడం ఖాయం. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు’అంటూ సంధు ట్వీట్‌ చేశారు.
 
ప్రస్తుతం సంధు చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌గా మారుతుంది. ఇప్పటికే ‘సైరా’కు సంబంధించిన ట్రైలర్‌, పాటలు హిట్టవ్వడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా సంధు రివ్యూతో ఈ చిత్రంపై అంచనాలు మరో రేంజ్‌కు వెళ్లాయి. ఇక టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం హిట్టవ్వాలని ప్రతీ ఒక్క సినిమా అభిమాని కోరుకోవడం విశేషం. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి.. సైరా ఫుల్‌ రివ్యూ (4/5)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా