సినిమానే పెళ్లి చేసుకున్నాడు..

22 May, 2019 00:00 IST|Sakshi

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి: చిరంజీవి

‘‘రెండు సినిమాలు చేయగానే ఎవరైనా కారు, ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్‌ ఉండాలనుకోవడం సహజం. కానీ, నాకు సినిమా ప్రాణం.. సినిమాయే నా జీవితం అనుకున్నాడు. సినిమానే ప్రేమించాడు, సినిమానే పెళ్లి చేసుకున్నాడు, సినిమానే తన బిడ్డలుగా అనుకున్నాడు నారాయణమూర్తి’’ అన్నారు చిరంజీవి. ఆర్‌.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’.

ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నారాయణమూర్తితో నా పరిచయం నాలుగు దశాబ్దాలది. 1978లో నేను ‘ప్రాణం ఖరీదు’ సినిమా చేస్తున్నప్పుడు నూతన్‌ ప్రసాద్‌కి పేపర్‌ అందించే అసిస్టెంట్‌ కుర్రాడి పాత్ర చేశాడు తను. అప్పుడే చాలా హుషారుగా, మాట్లాడుతుండటంతో క్యూరియాసిటీతో ఏ ఊరు? అని అడిగితే రాజమండ్రి దగ్గర రావులపాలెం అని చెప్పాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు కూడా మా స్నేహం, అనుబంధం కొనసాగుతోంది. కష్టంతో, దీక్షతో అలుపెరుగని పోరాటం చేసి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ‘పీపుల్స్‌స్టార్‌’ ఆర్‌.నారాయణమూర్తి అనిపించుకునే కీర్తి సంపాదించుకున్నాడు. సినిమాల్లో ఎవరైనా పాపులారిటీ కోసం పొల్యూట్‌ అవడానికో, కమర్షియల్‌ వైపు మొగ్గు చూపడానికో ఇష్టపడతారు. కానీ, ఆయన మాత్రం నో అంటారు. తనది కమ్యూనిజం భావజాలం. సినిమాని ఓ సాధనంగా చేసుకుని తన భావాలతో ప్రజల్ని ఆలోచింపచేసే, సందేశాత్మక సినిమాలు తీయడం అన్నది ఓ అభ్యుదయవాదిగా ప్రతి ఒక్కరూ అభినందించాలి.

1984 నుంచి ఇప్పటి వరకూ 30 సినిమాలు ఓ నటుడిగా, నిర్మాతగా తను నమ్మిన బాటలో ముందుకు వెళుతూ మనందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నాడంటే అతని కమిట్‌మెంట్‌ అంతా ఇంతా కాదు. కమర్షియల్‌ సినిమాలవైపు ఎవరైనా కొంచెం ఆకర్షితులవుతారు.. కానీ అతడు అవ్వడు అనటానికి చిన్న ఉదాహరణ.. ‘టెంపర్‌’కి పూరి జగన్నాథ్‌గారు నారాయణమూర్తి పేరుతోనే ఓ పాత్ర రాసి, దీన్ని మీరు చేస్తేనే బాగుంటుందంటే, ‘కమర్షియల్‌ సినిమాల్లోకి నన్ను లాగకండి. నేను ఇలాంటి పాత్రకి న్యాయం చేయలేనేమో’ అని నో చెప్పాడు. తన వ్యక్తిగత జీవితం మొదటి నుంచి పరిశీలిస్తున్నా. పాండి బజార్‌లో హవాయ్‌ చెప్పులేసుకుని, తెల్లదుస్తులతో, భుజాన ఓ సంచి వేసుకుని ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్లి, సినిమా ఆఫీసుల చుట్టూ వేషాల కోసం తిరిగేవాడు. అప్పటి నారాయణమూర్తి ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అలా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఇవన్నీ కలిపితే ఓ విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న ఇలాంటి మనిషి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వెతికినా దొరకరు. అరుదైన వ్యక్తి నారాయణమూర్తి. తన సినిమాల్లో అన్ని విభాగాలు తానే చూసుకుంటూ ఆ రకంగా కూడా అరుదైన రికార్డు సాధించారాయన. ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’ సినిమా కథాంశం ఏంటంటే.. భ్రష్టు పట్టిపోతున్న నేటి సమకాలీన రాజకీయాలు, అస్తవ్యస్తమైపోతున్న ప్రజాస్వామ్యాన్ని ఎలా మనం పరిరక్షించుకోవాలి? మన బాధ్యత ఏంటి? అంటూ చాలా చక్కగా తీశారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా మొన్న జరిగిన ఎన్నికల ముందు విడుదలై ఉంటే దాని ప్రభావం వేరుగా ఉండేది. అయినా ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి, మనోడి జీవితంలో మరో కలికితురాయి కావాలి. నీ సక్సెస్‌ఫుల్‌ ప్రస్థానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు. 

ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘ఇటీవల చిరంజీవిగారిని కలిసి, ‘సార్‌.. నా సినిమా ఆడియో మీ చేతుల మీదుగా రిలీజ్‌ చేస్తే.. ప్రమోషన్‌కు పెద్ద హెల్ప్‌ అవుతుంది సార్‌.. ప్లీజ్‌ సార్‌’ అన్నాను. ‘నేను వస్తున్నాను’ అన్నారు. సాటి నటుడిపై ఆయనకు ఉన్న అభిమానానికి నేను శిరస్సు వంచి దండం పెడుతున్నాను. ఓ సందర్భంలో చిరంజీవిగారికి, నూతన్‌ ప్రసాద్‌గారికి, చంద్రమోహన్‌గారికి రాజమండ్రిలో అప్సర లాడ్జిలో బస ఏర్పాటు చేశారు. నన్ను కూడా అక్కడే పెడతారేమో అనుకుంటే వంటలు వండే పాకలో పెట్టారు. అప్పుడు నేను ఓ షాట్‌లోకి వెళ్తున్నాను. అప్పుడు వాక్‌మన్‌ పెట్టుకుని ఓ యంగ్‌ చార్మ్‌ వస్తున్నాడు. ఎట్రాక్టివ్‌గా ఉన్నాడు. ఎవర్రా బాబు అనుకున్నాను.. తీరా చూస్తే.. చిరంజీవిగారు. ఎడ్వర్డ్‌ ఫాక్స్, రజనీకాంత్, శత్రుఘ్న సిన్హా వంటి నటులు రూల్‌ చేసినట్లే చిరంజీవిగారు కూడా తెలుగు ఇండస్ట్రీని రూల్‌ చేస్తారనుకున్నాను. బాస్‌ యు ఆర్‌ గోయింగ్‌ టు రూల్‌ తెలుగు ఇండస్ట్రీ అన్నాను. థ్యాంక్స్‌ నారాయణ అన్నారు.

చిరంజీవిగారు ‘ఖైదీ’ నుంచి ఇప్పటివరకు మెగాస్టార్‌గా కూర్చొని ఉన్నారు. ఆయన ఎన్ని సినిమాలు చేసినా సరే. ఇవాళ ఆయన చేస్తున్న ‘సైరా’తో ఆయన జన్మ ధన్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు చిరంజీవి మెగాస్టార్‌.. ‘సైరా’ విడుదల తర్వాత ఒమెగా స్టార్‌ అవుతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అనే అంశం ఆధారంగా తీసినదే నా‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’’ అన్నారు. దర్శకుడు కొరటాల శివ, సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్, పాటల రచయితలు సుద్దాల అశోక్‌తేజ, గోరేటి వెంకన్న, మాటల రచయిత గెడ్డం సుధాకర్, ‘ఆదిత్య’ మ్యూజిక్‌ ఉమేశ్‌ గుప్తా, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు