చిరంజీవి కథ రాసే అవకాశం ఇచ్చారు!

6 Nov, 2015 00:37 IST|Sakshi
చిరంజీవి కథ రాసే అవకాశం ఇచ్చారు!

‘‘ఈ సినిమా హిట్టయితే నీకు దర్శకుడిగా అవకాశం ఇస్తాను’’.. ఒకప్పుడు చంద్రమహేశ్‌కి డా. డి. రామానాయుడు ఇచ్చిన మాట ఇది. దానికి కారణం ‘శివయ్య’ చిత్రకథ. పోసాని కృష్ణమురళి రాసిన ఆ కథను రామానాయుడికి చెప్పింది చంద్రమహేశే. ఆ సినిమా వంద రోజులాడింది. దాంతో సురేష్ ప్రొడక్షన్స్‌లో ‘ప్రేయసి రావే’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం చంద్రమహేశ్‌కి ఇచ్చారు. ఆ సంస్థలో ‘సూపర్ పోలీస్’ చిత్రం ద్వారా సహాయ దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టి, మళ్లీ అదే సంస్థ ద్వారా దర్శకుడైనందుకు ఆనందపడ్డారు చంద్రమహేశ్. ‘‘ఆ సినిమా చూసి, చిరంజీవిగారు అభినందించారు.

కథలు రాయమని రెండు మూడు సార్లు అవకాశం కూడా ఇచ్చారు. కానీ, ఎందుకో సెట్ కాలేదు’’ అని గురువారం పాత్రికేయుల సమావేశంలో చంద్రమహేశ్ అన్నారు. హెచ్.హెచ్. మహదేవ్ హీరోగా ఆయన దర్శకత్వంలో పి.ఎన్. త్రిలోక్ రెడ్డి సమర్పణలో పీవీ శ్రీరాం రెడ్డి నిర్మించిన ‘రెడ్ అలర్ట్’ నేడు తెరకొస్తోంది. చంద్రమహేశ్ మరిన్ని విశేషాలు చెబుతూ - ‘‘శ్రీహరితో నేను చేసిన ‘అయోధ్య రామయ్య’, ‘ఒక్కడు’ మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత జయాపజయాల సమాహారంతో కెరీర్ సాగుతోంది. నేను దర్శకత్వం వహించిన చిత్రాలు చూసి, శ్రీరాంరెడ్డిగారు సినిమా చేద్దాం అన్నారు. ‘రెడ్ అలర్ట్ ‘ కథ వినగానే తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో నిర్మిద్దామని ఆయన అన్నారు. గతేడాది మార్చిలో షూటింగ్ మొదలుపెట్టి, డిసెంబర్‌కల్లా పూర్తి చేశాం. అన్ని భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేయాలనుకున్నాం. కానీ, శ్రీరాంరెడ్డిగారు ఆకస్మాత్తుగా మరణించడం, షాక్‌కి గురి చేసింది. కన్నడ, మలయాళంలో విడుదల చేశాం. అక్కడ కన్నా తెలుగులో మరింత విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది. మహదేవ్‌కి హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు.