చిరు ఆగయా.. మెలోడీ బ్రహ్మ ఫిక్స్‌!

2 Jan, 2020 16:48 IST|Sakshi

‘సైరా నరసింహారెడ్డి’చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఓ మంచి రోజు చూసి కొబ్బరికాయ కొట్టి షూటింగ్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు.  ఇన్ని రోజులు ప్రి ప్రొడక్షన్స్‌ పనులు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ నేటి నుంచి ఆరంభమైంది. హైదరాబాద్‌ శివార్లలో వేసిన ఓ సెట్‌లో బాస్‌(చిరంజీవి) అడుగుపెట్టారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అయితే మెగాస్టార్‌ షూటింగ్‌లో అడుగుపెట్టిన రోజునే చిత్ర బృందం సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ఫ్యాన్స్‌కు తెలిపింది. 

ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడని మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్‌ సాంగ్స్‌ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. దీంతో చిరు-మణిల కాంబో సంగీత ప్రియుల్ని మరోసారి మైమరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. 

అయితే లీకువీరులు అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్‌ సరసన త్రిష నటించనుందని సమాచారం. అంతేకాకుండా ఐటమ్‌ సాంగ్‌ కోసం చిత్ర బృందం రెజీనాను సంప్రదించగా ఆమె తిరస్కరించిందని టాలీవుడ్‌ టాక్‌. అయితే టాలీవుడ్‌ మెగాస్టార్‌ సినిమాలో అందివచ్చిన అవకాశాన్ని రెజీనా చేజేతులా వృథా​ చేసుకుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఈ ఐటమ్‌ సాంగ్‌ను మాస్‌ ఆడియన్స్‌ ఊగిపోయే రీతిలో మణిశర్మ కంపోజ్‌ చేశారని కూడా తెలుస్తోంది.

మెగాస్టార్‌ చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్‌ కొరటాల శివ.. ఈ చిత్రాన్ని తనదైన రీతిలో కాన్సెప్ట్‌ బేస్డ్‌తో పాటు మాస్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో చాలా హుందాతనం కలిగిన రోల్ కావడంతో చిరు ఈ పాత్రకు తగ్గట్లుగా రెడీ అవ్వడానికి ఇన్ని రోజులు గ్యాప్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా,  ఈ సినిమాలో చిరు లుక్‌ ఇదేనంటూ ఓ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 

ఇక ఈ సినిమా దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు.. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘గోవిందాచార్య’ మరియు ‘గోవిందా హరి గోవిందా’ ‘ఆచార్య’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే మూవీ టైటిల్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: 
రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం
మోహన్‌బాబును ఆలింగనం చేసుకున్న చిరంజీవి

 

మరిన్ని వార్తలు