బాలయ్య సంగీత దర్శకుడి ఆవేదన

8 Jun, 2018 14:15 IST|Sakshi
గౌతమిపుత్ర శాతకర్ణి, జై సింహా చిత్రాల సంగీత దర్శకుడు చిరంతన్‌ భట్‌

కంచె సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన సంగీత దర్శకుడు చిరంతన్‌ భట్‌. ఈ సినిమాలో చిరంతన్‌ వర్క్‌ నచ్చిన దర్శకుడు క్రిష్‌, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి పనిచేసే అవకాశం కల్పించారు. శాతకర్ణి సినిమా విజయంలో చిరంతన్‌ అందించిన సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. పాటలతో పాటు నేపథ్య సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అందుకే బాలయ్య తన తదుపరి చిత్రం జై సింహాకు కూడా చిరంతన్ భట్‌కే అవకాశమిచ్చాడు.

అయితే తాజాగా ప్రకటించిన జియో 65వ సౌత్‌ ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌ విషయంలో చిరంతన్‌ భట్‌ హర్ట్‌ అయ్యాడు. ఈ అవార్డ్స్‌ లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా పలు విభాగాల్లో పోటికి నామినేట్ అయ్యింది. కానీ సంగీతం, సాహిత్య విభాగాల్లో మాత్రం పోటికి నామినేట్‌ కాలేదు. ఈ విషయంపై తన ట్విటర్‌లో స్పందించిన చిరంతన్‌ ‘గౌతమిపుత్ర శాతకర్ణి చాలా విభాగాల్లో నామినేట్‌ అయ్యింది సంగీతం, సాహిత్య విభాగాల్లో తప్ప. అంటే సీతారామశాస్త్రీ గారు, నేను మరింత హార్డ్‌ వర్క్ చేయాలేమో’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ అవార్డ్స్‌ కోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌ విభాగంలో అనూప్‌ రుబెన్స్‌, దేవీ శ్రీ ప్రసాద్‌, కీరవాణి, మిక్కీ జే మేయర్‌, శక్తికాంత్‌ కార్తీక్‌లు పోటీ పడుతుండగా.. సాహిత్య విభాగంలో చైతన్య పింగళి, చంద్రబోస్‌, కీరావాణి, రామజోగయ్య శాస్త్రీ, శ్రేష్టలు పోటిపడుతున్నారు.

మరిన్ని వార్తలు