అప్పుడు తప్పకుండా ఆ శుభవార్త చెబుతా!

21 Feb, 2014 23:41 IST|Sakshi
అప్పుడు తప్పకుండా ఆ శుభవార్త చెబుతా!

 స్వాతిలో తెలీని మెస్మరైజింగ్ పవర్ ఉంది. కాసేపు మాట్లాడితే చాలు అయస్కాంతంలా ఆకర్షించేస్తుంది తను. ఆ క్వాలిటీనే... ఆమెను దక్షిణాదిన బిజీ తారని చేసింది. ప్రస్తుతం తమిళం, మలయాళం సినిమాలతో స్వాతి బిజీ బిజీ. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. అదే ‘బంగారు కోడిపెట్ట’. నవదీప్ ఇందులో హీరో. రాజ్ పిప్పళ్ల దర్శకుడు. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానుంది. అందుకే... శుక్రవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించింది స్వాతి.
 
 అప్పుడే ఏడాది కావొస్తుందా!: తెలుగులో నా సినిమా వచ్చి ఏడాది కావస్తుందంటే... నమ్మబుద్ధి కావడం లేదు. తమిళం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్న కారణంగా కాస్త గ్యాప్ వచ్చింది. ‘బంగారు కోడిపెట్ట’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. పేరు భానుమతి పినిశెట్టి. చదివింది 8వ తరగతి. అమ్మానాన్న లేరు. అక్కాబావా దగ్గర ఉండటం ఇష్టం లేదు. అందుకే వారి నుంచి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నాలు. ఎవరితోనైనా సరే.. కంటిచూపుతోనే పనులు చేయించేసుకుంటా. ఇలా సాగుతుంది నా పాత్ర. ‘స్వామి రారా’లోని నా పాత్రతో పోలిస్తే ఎట్నుంచి చూసినా కొత్తగా ఉంటుందీ పాత్ర.


 తనకు మంచి బ్రేక్ రావాలి: కథే ఈ చిత్రానికి ప్రాణం. కొంత విలేజ్‌లో కొంత సిటీలో ఈ కథ సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాజ్ పిప్పళ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ రాబరీ నేపథ్యంలో కథ సాగుతుంది. అయితే ‘స్వామి రారా’కు పూర్తి భిన్నంగా ఉంటుంది. దర్శకుడు కథను చెప్పిన తీరు సూపర్బ్. ప్రతి సన్నివేశం సంతృప్తికరంగా రావడానికి తను పడిన కృషి నిజంగా అభినందించదగిందే. ఇక నవదీప్ గురించి చెప్పాల్సి వస్తే... తనతో సినిమా చేస్తున్నాను అనగానే... చాలామంది రకరకాలుగా మాట్లాడారు. కానీ.. తనతో చేశాక అవన్నీ కరెక్ట్ కాదనిపించింది. నవదీప్ మంచి నటుడు. మంచి బ్రేక్ వస్తే తనేంటో నిరూపించుకోగలడు. ఈ సినిమాతో అది జరుగుతుంది.


 నిజంగా వారికి హేట్సాఫ్: గ్లామర్ పాత్రలకు నేను దూరం కాదు. అయితే.. దర్శక, నిర్మాతలు నన్ను ఆ కోణంలో చూడటం లేదు. ఆ విధంగా చూసుకుంటే నేను నిజంగా లక్కీనే. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయగలుగుతున్నాను. హీరోహీరోయిన్లు తొలిసారి కలిసినప్పుడు... మన సినిమాల్లో కొన్ని సింబాలిక్ షాట్స్ వేస్తారు. కానీ నిజజీవితంలో అలాంటివి జరగవు. నా సినిమాల్లో కూడా అలాంటివి ఉండవ్. సాధ్యమైనంతవరకూ నిజానికి దగ్గరగానే నా సినిమాలుంటాయి. గ్లామర్ పాత్రలతో పోలిస్తే... ఇలాంటి పాత్రలు చేయడమే నాకు తేలిక. గ్లామర్ ఇమేజ్ కోసం వారు పడే కష్టాలు అంతా ఇంతా కాదు. డ్రెస్ దగ్గర్నుంచి నెయిల్ పాలిష్ వరకూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒళ్లు అలిసిపోయేలా డాన్సులు చేయాలి. అన్ని కష్టాలు భరిస్తే కానీ వారికి ఆ ఇమేజ్ రాదు. నిజంగా వారిని అభినందించాల్సిందే.


 అది సరైనది కాదు: నేను తెలుగమ్మాయిని అవడం వల్లే ఇక్కడ నన్ను ప్రోత్సహించడంలేదు అనడం సరికాదు. సినిమా అనేది బిజినెస్‌తో ముడిపడిన విషయం. ఇక్కడ క్రేజ్ ముఖ్యం. ఒక ముంబయ్ హీరోయిన్ తమ సినిమాలో కథానాయిక అంటే... అదో క్రేజ్ కదా. అందుకే... అది తప్పు అని నేను అనను. నేను నచ్చినవారి వద్ద నాకు నచ్చిన కథల్ని ఎంచుకుని ముందుకెళుతున్నాను. ఇదే నాకు కంఫర్ట్‌గా ఉంది.


 గ్లామర్ అంటే ఆమే: గ్లామర్ అంటే ఏంటి? అని ఎవరైనా అడిగితే... నేను సింపుల్‌గా చెప్పే సమాధానం శ్రీదేవి. ఆమె అందంగా కనిపిస్తుంది. అద్భుతంగా నటిస్తుంది. అందుకే అందానికి పర్యాయపదం ఆమె. నాకంటూ డ్రీమ్ రోల్స్ ఏమీ లేవు. మంచి పాత్రలు చేసుకుంటూ పోవడమే నా ముందున్న లక్ష్యం. ఇక రూమర్లు అంటారా! వాటిని అస్సలు పట్టించుకోను. పాజిటివ్ థింకింగ్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే భవిష్యత్తులో మనకు అంతా మంచే జరుగుతుంది. పెళ్లి గురించి కూడా చాలామంది అడుగుతుంటారు. ఒకరినొకరు భరించుకోవడమే దాంపత్యం అని నా ఉద్దేశం. అలా నన్ను భరించేవాడు, నేను భరించగలిగేవాడు దొరికినప్పుడు తప్పకుండా శుభవార్త చెబుతా.

>