గురువుతో మరోసారి

25 Jan, 2014 01:39 IST|Sakshi
గురువుతో మరోసారి

 పాత్రలకు పరిపూర్ణంగా జీవం పోయాలని పరితపించే యువ నటుల్లో భరత్ ఒకరు. జయాపజయాలను పక్కన పెడితే ఈ యువ నటుడి చిత్రాలు నిర్మాతలకు, బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. భరత్‌కు కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి వ్యాపారం ఉంటుంది. ఇటీవల బాలీవుడ్‌లోకి కూడా రంగ ప్రవేశం చేసిన ఈ బాయ్స్ హీరో తాజాగా మాలీవుడ్‌లో కూడా తెరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా భరత్‌తో చిన్న భేటి.....
 
 ప్ర: మీ సినీ కెరీర్‌లో తొలి బిగ్ బ్రేక్ చిత్రం ఏది?
 జ: 16 ఏళ్ల వయసులోనే ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే అదృష్టాన్ని అందుకున్న నటుడిని నేను. చాలామంది యువ నటుల కల అయిన అది నాకు ఆదిలోనే నెరవేరింది. ఇక నాకు తొలి బ్రేక్ ఇచ్చిన చిత్రం కాదల్.
 
 ప్ర: మీ జీవితంలో మరచిపోలేని సంఘటన ఏదైనా ఉందా?
 జ: సినిమానే ఒక విచిత్రం. ఈ పరిశ్రమలో ఎన్నో మరపురాని సంఘటనలను చవి చూస్తాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేము. అంతం లేని వింత సినిమా పరిశ్రమ.
 
 ప్ర: మీరు ఇష్టపడే హాలిడే ప్రదేశం?
 జ : స్విట్జర్లాండ్. నేనెంతగానో ఇష్టపడి వెళ్లే హాలిడే ప్రదేశం ఇది.
 
 ప్ర: ఫలాన దర్శకుడితో పని చేయాలనే కోరిక ఉందా?
 జ : చాలామంది దర్శకులతో పనిచేయాలనుంది. ముఖ్యంగా మరోసారి గ్రేట్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించాలనే కోరిక బలీయంగా ఉంది. నేనిప్పటికీ బాయ్స్ చిత్రం సహా 25 చిత్రాలు చేశాను. ఈ సందర్భంగా నా గురువు అయిన శంకర్‌తో పని చేయాలనుకుంటున్నాను. అలాగే దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉంది.
 
 ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
 జ : మలయాళంలో కూతర అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్ర చేయడం విశేషం. తమిళంలో సెంథిల్‌కుమార్, రవి దర్శకత్వంలో నటిం చనున్నాను.

>