300 కోట్లతో మరో ‘మహాభారతం’

8 Apr, 2018 14:01 IST|Sakshi

సినిమా కథలను ఎక్కువగా పురాణాల నుంచి ఇన్స్‌పైర్‌ అయ్యే తయారుచేసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో పౌరాణిక, జానపద కథలను సినిమాలుగా తెరకెక్కించాలన్న ఆసక్తి దర్శక నిర్మాతల్లో పెరుగుతోంది. బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలు ఘనవిజయాలు సాధించటంతో చాలా మంది సినీ ప్రముఖులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.

దర్శకధీరుడు రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించటం తన జీవితాశయమని ఇప్పటికే ప్రకటించేశారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ కూడా కృష్ణుడి కోణంలో మహాభారతాన్ని రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు. మలయాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్రలో భీముడి కోణంలో మరో మహాభారతం సిద్ధమవుతోంది. తాజాగా మరో దక్షిణాది నటుడు మహాభారత గాథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

విలక్షణ నటుడు విక్రమ్‌ ప్రధాన పాత్రలో ఆర్‌ఎస్‌ విమల్‌ దర్శకత్వంలో కర్ణుడి కోణంలో మహాభారతాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా ఈ సినిమాను మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ హీరోగా 60 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కించాలని భావించారు. కానీ ప్రాజెక్ట్ విక్రమ్‌ చేతికి రావటంతో బడ్జెట్‌ రేంజ్‌ కూడా మారిపోయింది. యునైటెడ్‌ ఫిలిం కింగ్ డమ్‌ అనే అమెరికా నిర్మాణ సంస్థ ఈ సినిమాను 300 కోట్లతో నిర్మించేందుకు ముందుకొచ్చింది. 

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ రెడీ కావటంతో ఇటీవల దర్శకుడు విమల్‌ స్క్రిప్ట్‌కు శబరిమల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2019 చివరికల్లా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దాదాపు 32 భాషల్లో డబ్‌ చేసి రిలీజ్‌ చేయనున్నారు.

మరిన్ని వార్తలు