సహజత్వానికి దగ్గరగా చూసీ చూడంగానే

20 Jan, 2020 00:18 IST|Sakshi
మాళవిక, శివ కందుకూరి, వర్ష

ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన తొలి చిత్రం ‘చూసీ చూడంగానే’. వర్ష, మాళవిక కథానాయికలుగా నటించారు. శేష సింధు రావు ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ – ‘‘ప్రతిభావంతులైన యువకులతో సినిమాలు చేయడానికే నేను ఎక్కువగా ఇష్టపడుతుంటాను. ఈ సినిమా కథకు మా అబ్బాయి శివ హీరో అయితే బాగుంటుందని దర్శకురాలు శేష చెప్పడంతో శివను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాను.

ఈ చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. గోపీసుందర్‌ సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణ. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ సినిమా విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘నాపై నమ్మకం ఉంచి నన్ను హీరోను చేసిన మా నాన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. కథ బాగా నచ్చింది. నా కోసం మంచి స్క్రిప్ట్‌ రాసిన శేషగారికి థ్యాంక్స్‌. యంగ్‌ టీమ్‌ అందరూ కలిసి చేసిన ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మా సినిమాను విడుదల చేస్తోన్న నిర్మాత డి.సురేష్‌బాబుగారికి థ్యాంక్స్‌’’ అన్నారు శివ. ‘‘శివ బాగా నటించడానికి ఆస్కారం ఉన్న పాత్ర ఇది.

హీరోయిన్‌  వర్ష బాగా నటించింది. షూటింగ్‌ పూర్తయ్యేలోపు వర్ష తెలుగు నేర్చుకుంది. మంచి డైలాగ్స్‌ రాసిన పద్మతో పాటు సహకరించిన నటీనటులు, చిత్రబందానికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు శేష. ‘‘చిన్న సినిమాలను రాజ్‌ కందుకూరిగారు ఎక్కువగా ప్రోత్సహిస్తుంటారు. ఆయన నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్‌ సాధించాలి. హీరోగా పరిచయం అవుతున్న శివకు ఇది సరైన సబ్జెక్ట్‌’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్‌. ‘‘ఇది నా తొలి తెలుగు సినిమా. శివ అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు వర్ష. ‘‘ఈ మూవీ నా కెరీర్‌కు మంచి బ్రేక్‌ ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు మాళవిక.

మరిన్ని వార్తలు