ఇక మెగాఫోన్ పట్టడమే!

22 Oct, 2017 10:25 IST|Sakshi

నెక్ట్స్‌గోల్‌ డైరెక్షనే అంటున్నారు ప్రముఖ నృత్యదర్శకుడు శోభి. కోలీవుడ్‌ టూ టాలీవుడ్‌ వయా మాలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్‌ అంటూ పలు భాషల్లో స్టార్‌ హీరోలతో స్టెప్స్‌ వేయిస్తూ ప్రముఖ నృత్య దర్శకుడిగా రాణిస్తున్న శోభి గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సీనియర్‌ నృత్యదర్శకుడు పౌల్‌రాజ్‌ వారసుడైన ఈయన ప్రముఖ నృత్య దర్శకులు సిన్నిప్రకాశ్, రాజుసుందరంల వద్ద సహాయకుడిగా పని చేసి నృత్యదర్శకుడిగా ప్రమోట్‌ అయ్యారు. ప్రస్తుతం తమిళం,తెలుగు భాషల్లో స్టార్‌ హీరో చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ నంబర్‌వన్ నృత్యదర్శకుడిగా రాణిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సాక్షి చిట్‌ చాట్‌.

చిత్ర రంగప్రవేశం గురించి?
నాన్న ప్రముఖ నృత్యదర్శకుడు. నాకు ఆయనే గురువు కూడా. నృత్యదర్శకుడిగా నా చిత్రరంగప్రవేశం తెలుగు చిత్రంతోనే జరిగింది. కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అల్లరిబుల్లోడు నా తొలి చిత్రం. తమిళంలో 2004లో కమలహాసన్ నటించి న వసూల్‌రాజా ఎంబీబీఎస్‌ చిత్రంతో పరిచయం అయ్యాను. ఆ తరువాత నృత్యదర్శకుడిగా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది.

ఎలాంటి పాటకు నృత్యరీతులు సమకూర్చడం కష్టం అనిపిస్తుంది.
సిట్యువేషన్ సాంగ్స్‌కు నృత్యరీతులు సమకూర్చడం కష్టమనే చెప్పాలి. హీరోహీరోయిన్లతోనే చిత్రీకరించే యువళగీతాలకు డాన్స్ కంపోజ్‌ చేయడం అంత సులభం కాదు.

డాన్స్ విషయంలో తమిళంకు, తెలుగుకు వ్యత్యాసం ఏమైనా ఉంటుందా?
పెద్దగా ఏమీ ఉండదు. అయితే తమిళంలో కథానుగుణంగా పాటల చిత్రీకరణ ఉండాలని భావిస్తారు. తెలుగులో కాస్త స్టార్‌ వ్యాల్యూస్‌ను బట్టి డాన్స్ కోరుకుంటారు. ఇంకో విషయం ఏమిటంటే ఎలాంటి పాటకైనా నృత్యరీతుల్ని డిసైడ్‌ చేసేది సంగీతమే.

ఏ హీరోకు నృత్యరీతులను సమకూర్చడం ఛాలెంజ్‌గా భావిస్తారు?
తమిళంలో విజయ్‌కు నృత్యరీతులను సమకూర్చడం ఛాలెంజింగ్‌ అనిపిస్తుంది.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్‌ తాజా చిత్రం పీకే 25, రామ్‌చరణ్‌తేజ రంగస్థలం, మహేశ్‌బాబు కొత్త చిత్రం, నాగచైతన్య చిత్రం అలాగే తమిళంలో నీదాన్, శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న వేలైక్కారన్, పొన్రామ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మరో చిత్రం, ఏంజిలినా ఇలా చాలా చిత్రాలు చేస్తున్నాను.

తమిళం, తెలుగు చిత్రాలేనా ఇతర భాషా చిత్రాలు చేశారా?
మలయాళం, కన్నడం, హిందీ చిత్రాలు కూడా చేశాను. తమిళం, తెలుగు చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇతర భాషల్లో ఎక్కువ చేయలేకపోతున్నాను.

మీది ప్రేమ వివాహమా?
అందరూ అదే అనుకుంటారు. నిజానికి మాది పెద్దల అనుమతితో జరిగిన పెళ్లే. నా భార్య లలిత నృత్యదర్శకురాలే.  మా పాప పేరు శమంతకమణి అశ్విక. ఈ పేరును నటుడు కమలహాసన్ పెట్టారు.

ప్రముఖ నృత్యదర్శకుడిగా రాణిస్తున్నారు. తదుపరి గోల్‌?
జ: దర్శకుడిగా మెగాఫోన్ పట్డడమే. అందుకు కథ సిద్ధం చేశాను. ఎప్పుడన్నది త్వరలోనే వెల్లడిస్తాను.

మరి హీరో కోరిక లేదా?
మీకో విషయం చెప్పాలి. నేను మొదట బాల నటుడిగానే పరిచయం అయ్యాను. తెలుగులో జూలకటక అనే చిత్రంలో నటించాను. ఆ తరువాత డాన్స్ పై దృష్టిసారించాను. ఏమో మంచి కథ అనిపిస్తే హీరోగా నటించవచ్చు.

మరిన్ని వార్తలు