సినిమా రివ్యూ: ఆటోనగర్ సూర్య

27 Jun, 2014 15:44 IST|Sakshi
సినిమా రివ్యూ: ఆటోనగర్ సూర్య
నటీనటులు: అక్కినేని నాగచైతన్య, సమంత, సాయికుమార్, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ల భరణి, జీవా, బ్రహ్మానందం, వేణుమాధవ్, అజయ్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్
సంగీతం: అనూప్ రూబెన్స్
కెమెరా: శ్రీకాంత్ నారోజ్
నిర్మాత: కె. అచ్చిరెడ్డి
మాటలు, దర్శకత్వం: దేవా కట్టా
 
 
పాజిటివ్ పాయింట్స్: 
నాగ చైతన్య ఫెర్ఫార్మెన్స్
మాటలు
 
నెగిటివ్ పాయింట్స్:
కథ, కథనం
వయెలెన్స్
మ్యూజిక్
 
'మనం' చిత్రం తర్వాత నాగచైతన్య, సమంతల క్రేజి కాంబినేషన్ లో వచ్చిన 'ఆటోనగర్ సూర్య' విడుదలకు అనేక అడ్డంకులు ఎదుర్కోంది.  గత కొద్ది రోజులుగా వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ చిత్రం జూన్ 27 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెన్నెల, ప్రస్ధానం చిత్రాలతో ఆకట్టుకున్న దేవ కట్టా దర్శకత్వంలో తాజాగా 'ఆటోనగర్ సూర్య' చిత్రం తెలుగు ప్రేక్షకులను సంతృప్తి పరిచిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకుందాం. 
 
చిన్నతనంలోనే ఓ రైలు ప్రయాణంలో తల్లి, తండ్రులను కోల్పోయిన సూర్య.. విజయవాడలో తన మేనమామ (సాయి కుమార్) వద్దకు చేరుకుంటారు. అయితే తన మేనమామ కూడా ఆదరించకపోవడంతో ఓ అనాధగా మారిన సూర్యను ఆటోనగర్ లో ఓ మెకానిక్ పెంచి పెద్ద చేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా.. తన తల్లితండ్రుల మరణానికి కారణం మేయర్ అని తెలుసుకుంటాడు. ఆటోనగర్ లోని అన్యాయాలను, అక్రమాలను ఎదురించే క్రమంలో 16 ఏళ్లకే సూర్య జైలు కెళుతాడు.  జైలు నుంచి విడుదలైన సూర్య జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఆటోనగర్ అన్యాయాలను, అక్రమాలను ఏవిధంగా ఎదుర్కొన్నాడు. ఆటో నగర్ లో ఎలాంటి మాఫియా కార్యక్రమాలు జరుగుతున్నాయి? తన మేనమామ ఆదరణకు సూర్య నోచుకోకపోవడానికి కారణమేంటి? తన తల్లి తండ్రుల మరణానికి మేయర్ ఎలా కారణమయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఆటో నగర్ సూర్య'.
 
నటీనటుల ఫెర్ఫార్మెన్స్:
నాగచైతన్య
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా సూర్య పాత్రలో నాగచైతన్య కనిపించాడు. పలు సన్నివేశాల్లో పాత్ర పరిధి మేరకు ఎమోషన్స్ పలికించడంలో సఫలమయ్యాడు. మనం చిత్రంలో క్లాస్ ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న నాగచైతన్య..  సూర్య పాత్ర ద్వారా మాస్ హీరోగా మెప్పించగల స్టార్ గా ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకున్నాడు. కథ, కథనంలో ఉన్న లోపాలను మరుగున పరిచే విధంగా నాగచైతన్య తన వంతు న్యాయం చేశాడు. మాస్ ఆడియెన్స్ గుర్తుంచుకునే విధంగా నాగ చైతన్య కనిపించాడు. 
 
సమంత 
సూర్య మరదలిగా సిరి పాత్రలో సమంత కనిపించింది. కథలో పలు క్యారెక్టర్ల డామినేషన్ కారణంగా సిరి పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోయింది. అయితే తనకు లభించిన కొన్ని సన్నివేశాల్లో సమంత మెప్పించింది. తండ్రి (సాయి కుమార్)నుద్దేశించే 'నాన్నా నీ ముఖం చూస్తే అసహ్యం వేస్తుంది' అనే ఓ సీన్ తోపాటు మరికొన్ని సీన్లలో ఒకే అనిపించడంతోపాటు.. 'సురా..సురా' అనే పాటలో  గ్లామర్ తో ఆకట్టుకుంది. 
 
ఈ చిత్రంలో సమంతకు తండ్రిగా, నాగచైతన్యకు మేనమామగా, యూనియన్ లీడర్ గా పలు షేడ్స్ ఉన్న కార్యెక్టర్ ను సాయి కుమార్ పోషించాడు. ఇలాంటి పాత్రలు సాయి కుమార్ కెరీర్ లో కొత్తేమి కాదు.. తనకు లభించిన పాత్రను అవలీలగా పోషించడంలో సాయి కుమార్ సఫలమయ్యాడు. విలన్ పాత్రల్లో 'చక్రవాకం' మధు, జయప్రకాశ్, అజయ్ లకు రొటిన్ పాత్రలే. బ్రహ్మనందం, వేణుమాధవ్, మాస్టర్ భరత్ ల కామెడీ అంతగా మెప్పించలేకపోయింది. 
 
సంగీతం:
అనూప్ రూబెన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంతగానే ఉంది. 'సురా సురా' పాట తప్ప గుర్తుండిపోతుంది. మిగితా పాటలు అంతాగా ఆకట్టుకునేలా లేవు. 
 
దర్శకత్వం:
వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో విమర్శకుల మెప్పు పొందిన దేవా కట్టా బెజవాడ ఆటోనగర్ నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే కథలో పట్టు లేకపోవడం, కథనం కూడా సరైన పంథాలో సాగకపోవడం కొంత నిరాశ కలిగించే విషయం. కథ, కథనంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.  అయితే ఈచిత్రంలో మాటల్ని తూటాల్ల పేల్చడంలో దేవా కట్టా సఫలమయ్యారని చెప్పవచ్చు. యాక్షన్ సీన్లు మితీ మిరడం కారణంగా కథ అదుపు తప్పిందనే భావన కలుగుతుంది. సెకాండాఫ్ లో కథపై క్లారిటీ లేకపోవడం కారణంగా చాలా గందరగోళం నెలకొంది. భారీ అంచనాతో ఈచిత్రానికి వెళ్లే ప్రేక్షకుడికి హింసే ప్రధాన అంశంగా ఎదురుపడటంతో నిరాశే మిగిలుతుందని చెప్పవచ్చు. 
 
ట్యాగ్: విడుదల కాకపోతే ఓ మంచి జ్ఞాపకం!