కదలని చిత్రం- బతుకు ఛిద్రం

30 Jun, 2020 09:51 IST|Sakshi

సినిమా హాళ్లు మూతపడి వందరోజులు

సినిమా..! ఇది ఒక కలల ప్రపంచం. రంగుల చిత్రం. చిన్నా పెద్దా, పేద ధనిక...  సినిమా అంటే  సంతోషం. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం ఓ ఆనందం. కానీ, దేశంలో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి చాలా రోజులైంది కదా! కరోనా మహమ్మారి వల్ల థియేటర్ల మాటే లేదు. సినిమాకు వెళ్లాలన్న ఊసే రావడం లేదు. దేశ చరిత్రలోనే ఇలాంటి సందర్భం ఎప్పుడూ లేదు. కరోనా మహమ్మారి దెబ్బకు గడిచిన వంద రోజులుగా థియేటర్లు బోసిపోయాయి. టాకీసు జీవితాలు అతలాకుతలమయ్యాయి. సినిమా రంగంపై ఆధారపడిన అన్ని బతుకులు చిధ్రమయ్యాయి

(సాక్షి, వెబ్‌ ప్రత్యేకం) : సినిమాలు, టీవీ సీరియళ్లతో పాటు వినోద కార్యక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నిలిచిపోయిన షూటింగుల కారణంగా మొత్తం సినీ రంగ పరిశ్రమ అతలాకుతలమైంది. స్టార్‌ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు వంటి అగ్రశ్రేణిలో ఉన్న వారికి మినహా ఈ పరిశ్రమపైన ఆధారపడిన లక్షలాది మంది భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. పరిశ్రమలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి మరీ ముఖ్యంగా కింది స్థాయిలో పనిచేసే వారు, వారి కుటుంబాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ మహమ్మారి గండం ఎప్పుడు గట్టెక్కుతుందా? బతుకులు మళ్లీ ఎప్పుడు దారిన పడుతాయో అర్థంకానీ అంతుచిక్కని అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. (లాక్‌డౌన్‌ విధిస్తే​ ఏం చేయాలి?)

శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ అభిమానులు థియేటర్ల ముందు వాలిపోయేవారు. అభిమానుల సందడితో అన్ని థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొనేది. కొత్త సినిమాలతో మల్టీప్లెక్స్‌లు, థియేటర్లు  కళకళలాడేవి. కరోనా లాక్‌డౌన్‌తో సీన్‌ రివర్సయింది. సినిమాల ప్రదర్శనలు నిలిపివేయడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. గత మార్చి నెల 22 వ తేదీన దేశవ్యాప్తంగా జనతా కర్ప్యూ, ఆ మరుసటి రోజు నుంచి లాక్‌డౌన్‌ విధించడంతో థియేటర్లు మూతపడ్డాయి. అలా దేశవ్యాప్తంగా వేలాది సినిమా హాళ్లు మూతపడి నేటికి సరిగ్గా వంద రోజులైంది. ఆ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో గందరగోళ పరిస్థితి.

ఒక్కో థియేటర్‌ ఎన్నో కుటుంబాల ఉపాధి
ఒక్కో థియేటర్‌లో టెక్నికల్‌ స్టాఫ్, లైట్‌మెన్, వాచ్‌మెన్లు, టికెట్‌ బుకింగ్‌ సిబ్బంది, రిప్రజెంటేటివ్స్‌ అంటూ 20 మందికి పైగా జీవనోపాధి పొందుతుంటారు. మల్టిప్లెక్స్‌ల్లో ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఇక థియేటర్లకు అనుబంధంగా నడిచే టీ స్టాళ్లు, కూల్‌డ్రింక్స్‌ సమోసాలు, ఐస్‌ క్రీం పార్లర్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ సెంటర్ల వంటి అనేక స్టాల్స్ తదితర వాటిల్లో పనిచేసే వారు కూడా థియేటర్లు మూతపడటంతో పరోక్షంగా ఉపాధి కోల్పోతున్నారు. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిశ్రమపైన ఆధారపడిన లక్షలాది మంది ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. (గ్రేటర్‌లో కరోనా.. హైరానా)

తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉండగా, మిగతా రాష్ట్రాలతో పోల్చితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిశ్రమపైన ఆధారపడుతున్న వారి సంఖ్య ఎక్కువే. దేశంలోనే అత్యధికంగా థియేటర్లు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ తర్వాత క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ సినిమా హాళ్లు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో 1750కి పైగా థియేటర్లు, 20కిపైగా మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇవన్నీ మూతపడటంతో వీటిలో పనిచేసే దాదాపు 40 వేల మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయారు. థియేటర్లు పనిచేస్తే వాటికి అనుబంధ వ్యాపారాలపై ఆధారపడిన వారు ఇంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు.

రెండు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా థియేటర్లు
ఆంధ్రప్రదేశ్‌లో 1200కు పైగా థియేటర్లు ఉన్నాయి. తూర్పుగోదావరి (144), కృష్ణా (141), గుంటూరు (129), పశ్చిమ గోదావరి (115) జిల్లాల్లో అత్యధిక థియేటర్లు ఉన్నాయి. విశాఖపట్నంలో 86, విజయనగరంలో 47, శ్రీకాకుళంలో 57, ప్రకాశంలో 73, నెల్లూరులో 62, చిత్తూరులో 106, కర్నూలు 103లో, వైఎస్సార్‌ కడపలో 80, అనంతపురంలో 77 థియేటర్లు ఉన్నాయి.  

ఇక తెలంగాణలో మొత్తం 520కు పైగా థియేటర్లు ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 122 థియేటర్లు ఉన్నాయి. జిల్లాల వారీగా థియేటర్లు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 68, వరంగల్‌లో 62, నల్గొండలో 54, కరీంనగర్‌లో 48, మెదక్‌లో 41, మెదక్‌లో 41, ఆదిలాబాద్‌లో 25, రంగారెడ్డిలో 20 థియేటర్లు ఉన్నాయి. ఇక రెండు రాష్ట్రాల్లోనూ 20కి పైగా మల్టిప్లెక్స్‌లు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా థియేటర్ల కష్టాలు
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా రికార్డుల ప్రకారం దేశవ్యాప్తంగా పది వేలకు పైగా సినిమా థియేటర్లు ఉన్నాయి. మల్టిప్లెక్స్‌లు అదనం. వీటిపై ఆధారపడి దాదాపు రెండు లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. అయితే వంద రోజులుగా థియేటర్లు మూతపడిన కారణంగా వారందరికి ఉపాధి కరువైంది. పేద సినీ కార్మికులకు బాలీవుడ్‌ సెలబ్రెటీల సాయం చేసే జాబితాలో వీరికి స్థానం ఉండదు. థియేటర్‌ యాజమాన్యాలు, పంపిణీదారులు ఆదుకునే పరిస్థితి నెలకొంది. అయితే సినిమాలు లేక వారి పరిస్థితే దయనీయంగా మారడంతో ఇంకొకరికి సాయం చేసే పరిస్థితిలో లేరు. (శ్యామ్‌ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్‌)

థియేటర్లు బంద్‌ - ప్రభుత్వాలకు భారీ నష్టం
థియేటర్లు మూతపడటంతో వాటిలో పనిచేస్తున్న వారే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీగా నష్టపోతున్నాయి. వినోదపు పన్నును రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలోనే ఉన్నాయి. టికెట్ల అమ్మకాలపైనే పన్ను విధిస్తారు.  దేశవ్యాప్తంగా అన్ని సినిమా హాళ్లలో కలిపి 40 లక్షల సీట్లు ఉన్నాయి. ఇందులో సగానికి సగం మేరకే ఆక్యుపెన్సీ ఉంటుందని అంచనాతో గణాంకాలను పరిగణలోకి  తీసుకున్నా ప్రతి షోకి దేశంలో 20 లక్షల మంది సినిమాలు చూస్తారు. ఆ లెక్కన ప్రతిరోజూ నాలుగు షోలు (మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్‌ షో, సెకండ్‌ షో) నడుస్తాయి. ఈ రకంగా చూస్తే రోజూ 80 లక్షల మంది సినిమాలు వీక్షిస్తున్నట్టు లెక్క. అయితే, ఇవి ఉజ్జాయింపు లెక్కలే. ఈ లెక్కలను చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు భారీగానే ఆదాయం కోల్పోయాయి. తక్కువ బడ్జెట్ మూవీకి ఒక స్లాబు మిగతా సినిమాలకు మరో స్లాబులో వినోదపు పన్ను ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో 8 నుంచి 30 శాతం వరకు వినోదపు పన్ను ఉంది. (నేటి నుంచి కరోనా పరీక్షలు)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు