అక్క.. అమ్మలా పెంచింది

26 Aug, 2018 08:26 IST|Sakshi

‘అన్నా చెల్లెళ్ల అనుబంధం... జన్మజన్మల సంబంధం’ అంటూ వివరించాడో రచయిత. సృష్టిలో ఓ అపూర్వ బంధమిది. అక్కాచెల్లెళ్లకుజీవితాంతం అండగా నిలిచే సోదరులు...అన్నాదమ్ములను అంతే ఆప్యాయంగా చూసుకునే సోదరీమణులు ఎందరో. వీరందరికీ రాఖీ పండగ ఎంతో ప్రత్యేకం. నేడు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ. ఈ సందర్భంగా అటు అక్కాచెల్లెళ్లను, ఇటు అన్నాదమ్ములను‘సాక్షి’ పలకరించింది. ఆ విశేషాల సమాహారమిది...

సాక్షి, సిటీబ్యూరో: ‘ మా అక్క అంటే నాకెంతో ఇష్టం. అమ్మ తర్వాత అమ్మలా నన్ను పెంచింది. మా కుటుంబంలో రాఖీ సంప్రదాయం లేకపోయినా... అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండగకు ప్రతిసారి మా అక్క జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అక్క ఫాతిమా నన్ను అల్లారు ముద్దుగా చూసుకునేది. మా సొంతూరు రాజమండ్రి. అక్క పెళ్లయ్యే నాటికి నా వయస్సు తొమ్మిదేళ్లు ఉంటుందేమో. వైజాగ్‌ వాళ్ల అత్తారిల్లు. వాళ్లింట్లో ఓ రోజు పాలు వేడి చేస్తుండగా చున్నీ అంటుకుంది. అక్క గమనించలేదు. వెనుక నుంచి మంటలు చెలరేగాయి. భయంతో ఇంట్లోంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. అక్కడున్న వాళ్లు గమనించి, అక్కపై నీళ్లు పోశారు. కానీ ఆ ప్రయత్నం వికటించింది. అప్పటికే అక్క ఆరు నెలల గర్భిణి.
కుటుంబసభ్యుతో అలీ...ఫాతిమా
నీళ్ల కారణంగా ఇన్ఫెక్షన్స్‌ బాగా పెరిగాయి. అక్కతో పాటు, కడుపులోని బేబీ కూడా చనిపోయింది. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న మా అక్క లేని లోటు నా జీవితంలో ఎప్పటికీ పూడ్చలేనిది. మా అక్క జ్ఞాపకంగా నా పెద్ద కూతురుకు ఆమె పేరు పెట్టుకున్నాను. అక్కను నా కూతురులో చూసుకుంటున్నాను. ప్రతి ఏటా రాఖీ సందర్భంగా తెలిసిన వాళ్లు వచ్చి రాఖీలు కడతారు. షూటింగులలో ఉన్నప్పుడు ఆ అనుబంధాలు బాగా తెలిసి వస్తాయి. అలా సినీనటి విజయశాంతి నన్ను తన సొంత సోదరుడిలా చూసుకునేది. ప్రతి ఏటా రాఖీలు కట్టేది. సినిమా రంగం నుంచి ఆమె దూరమయ్యాక రాఖీలు కట్టడం తగ్గిపోయింద’ని అక్క ఫాతిమాతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ సినీ నటుడు అలీ.

మరిన్ని వార్తలు