డాక్టర్‌ అయ్యాకే యాక్టర్‌ అయ్యాడు 'భద్రమ్‌"

18 Jul, 2020 07:06 IST|Sakshi

డాక్టర్‌గా, యాక్టర్‌గా అవగాహన కల్పిస్తున్న భద్రమ్‌

ఆన్‌లైన్‌ వేదికగా లాఫర్‌ యోగా శిక్షణ

నవ్వడం ఒక భోగం... నవ్వలేకపోవడం ఒక రోగం అనే మాట నిజమేనంటాడు ప్రముఖ నటుడు, కమెడియన్‌ భద్రం. సహజమైన హాస్యానికి మాత్రమే కాదు స్వచ్ఛమైన మనస్సుకు కూడా కేరాఫ్‌ అడ్రస్‌  భద్రమ్‌. చాలా మంది నటులు డాక్టర్‌అవ్వాలకుని యాక్టర్‌ అయ్యాను అంటారు. కానీ తను మాత్రం డాక్టర్‌ అయ్యాకేయాక్టర్‌ అయ్యాడు. శారీరక రుగ్మతలకు తన వైద్యంతోనూ, మానసిక సమస్యలకు తన హాస్యంతోనూ ట్రీట్‌మెంట్‌ చేస్తున్నాడు.  ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో   శారీరక, మానసిక ధృఢత్వాన్ని పెంచడానికి యోగా అత్యుత్తమమార్గం అంటున్న ఆయన ఆన్‌లైన్‌ వేదికగా  లాఫర్‌ యోగాను పరిచయం చేస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో :తను తెరపైన కనిపిస్తే చాలు నవ్వుల పువ్వులు పూయిస్తాడు. గోదావరి యాసతో, స్వచ్ఛమైన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తాడు. ప్రతిరోజూ పండగే, పూరీజగన్నాథ్‌ జ్యోతిలక్ష్మీ, నానీ భలేభలే మగాడివోయ్, శర్వానంద్‌ మహానుభావుడు, శతమానంభవతి, వరుణ్‌తేజ్‌ మిçస్ట్టర్, ఒక్క అమ్మాయి తప్ప  తదితర సినిమాల్లో కమెడియన్‌గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హాస్యంలోనూ విభిన్న శైలితో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే తెర వెనుక కూడా ఆసక్తికరమైన  విధులే నిర్వర్తిస్తున్నాడు.

ఎర్గనామిక్స్‌ స్పెషలిస్ట్‌...
తనొక డాక్టర్‌ (ఫిజియోథెరపిస్ట్‌)... ఎర్గనామిక్స్‌లో స్పెషలిస్ట్‌ డాక్టర్‌. ధీర్ఘకాలికంగా కూర్చొని జాబ్‌ చేసే వారికి (సాఫ్ట్‌వేర్స్, అకౌంటెంట్స్, సిస్టమ్‌ ఆపరేటర్స్‌..)కు వచ్చే ఆరోగ్య సమస్యలకు ట్రీట్‌మెంట్‌ చేస్తుంటాడు. ఇందులో భాగంగా భద్రమ్‌ గూగుల్, ఇన్ఫోసిస్‌ లాంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా పని చేశాడు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ఎర్గానామిక్స్‌ ట్రైనింగ్, వర్క్‌షాప్‌లను నిర్వహించాడు. ఇలా భిన్నమైన రెండు రంగాల్లో అటు శారీరకంగా ఇటు మానసికంగా సాంత్వన చేకూర్చడం తన అదృష్టంగా భావిస్తున్నానంటూన్నాడు భద్రమ్‌. వృత్తిపరంగా డాక్టర్‌గా,ప్రవృత్తిలో యాక్టర్‌గా ముందుకు సాగడం తనకు రెండు కళ్లలాంటివని అంటున్నాడు.  

ఆన్‌లైన్‌ వేదికగా లాఫర్‌ యోగా...
మనిషికి ఆరోగ్యకరమైన జీవనం ఎంత అవసరమో ప్రస్తుత పరిస్థితులు వివరిస్తున్నాయి.  చేతులు దాటాక ఆరోగ్య నియమాలు పాటించడం కన్నా ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం అని పరిస్థితులు నిరూపిస్తున్నాయి.. అందుకే ప్రతీఒక్కరికీ  శారీరక, మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించడమే సంకల్పంగా,  ఆన్‌లైన్‌ వేదికగా లాఫర్‌ యోగాతో వస్తున్నాడు యోగా, స్ట్రెస్‌ థెరపిస్ట్‌ భద్రమ్‌. యోగాతో వచ్చే ఫలితాలు అందరికీ అందాలని, యోగాపై అవగాహన పెంచడమే తన ప్రయత్నమంటున్నాడు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక రుగ్మతలకు, బీపి, డయాబెటీస్, థైరాయిడ్, కీళ్లనొప్పులు, నిద్రలేమిలాంటి వాటికి యోగా మంచి ప్రత్యామ్నాయమని, ఈ కరోనా యుగంలో యోగా ఒక ఆరోగ్య సంరక్షణ అని అంటున్నాడు ఈ డాక్టర్‌. కొన్ని అనారోగ్య సమస్యలకు మెడిసిన్స్, మంచి ఆహరం ఎంత ముఖ్యమో యోగా కూడా అంతే అవసరం అంటున్నాడు. దీని కోసం థెరప్యుటిక్‌ యోగా ఎంతో ఉపకరిస్తుందని, ఇందులోని ప్రాణా యామం, ఆసనాలు, ముద్రలు స్వస్థతని కలిగిస్తాయని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయంటున్నాడు. దీని పైన అవగాహన కోసం అందరికీ యోగా... అందరికీ ఆరోగ్యం... అనే 3 రోజుల ఆన్‌లైన్‌ కోర్స్‌ని నిర్వహిస్తున్నానన్నారు. అందరికి ఏదో రూపంలో ఇలా సేవ చేసుకోవడం ఆత్మ సంతృప్తిని ఇస్తుందని అంటున్నాడు ఈ డాక్టర్‌ కం యాక్టర్‌....!  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా