శ్రీనివాసరెడ్డి హీరో అయ్యాడోచ్!

23 Dec, 2013 04:23 IST|Sakshi
శ్రీనివాసరెడ్డి హీరో అయ్యాడోచ్!
కమెడియన్లు హీరోలవ్వడం సినిమా పుట్టిన తొలినాళ్ల నుంచీ జరుగుతూనే ఉంది. కస్తూరి శివరావు నుంచి సునీల్ దాకా హాస్యనటులందరూ హీరోలు అనిపించుకున్నవారే. ఇప్పుడు ఆ జాబితాలో శ్రీనివాసరెడ్డి కూడా చేరబోతున్నారు. ఆయన హీరోగా త్వరలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. రాజ్‌కిరణ్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. 
 
 బుల్లితెర వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన శ్రీనివాసరెడ్డి పాపులర్ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ‘ఇష్టం’ సినిమాతో కమెడియన్‌గా ఆయన సినీ కెరీర్ మొదలైంది. ‘ఇడియట్’ సినిమా నటునిగా శ్రీనివాసరెడ్డికి పెద్ద బ్రేక్. వెంకీ, సింహాద్రి, యమదొంగ, సోలో, అత్తారింటికి దారేది తదితర చిత్రాలతో హాస్యనటునిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారాయన. త్వరలో హీరోగా కూడా తన సత్తా చాటడానికి సంసిద్ధమవుతున్న శ్రీనివాసరెడ్డికి జోడీగా ఓ ప్రముఖ కథానాయిక నటించనున్నట్లు తెలిసింది.