కుర్రకారుకి కునుకు పట్టనివ్వని హీరోయిన్

24 Jul, 2014 16:36 IST|Sakshi
శృతి హాసన్ - సమంత

సినీ ప్రపంచంలో ఒక్కో హీరోయిన్ ఒక్కోసారి ఓ వెలుగు వెలిగిపోతుంటుంది. ఇప్పుడు అది సమంత వంతైంది. ఈ ముద్దు గుమ్మ ఇటు టాలీవుడ్లోనూ, అటు కోలీవుడ్లోను కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఆ పేరు వింటేనే  కుర్రాళ్లకు నిద్రపట్టడంలేదు. మరోవైపు నిర్మాతలకు కనక వర్షం కూడా కురిపిస్తోంది. సమంత నటిస్తే సినిమా హిట్టే అనే టాక్ కూడా వచ్చింది. దాంతో నిర్మాతలు ఆమె కోసం బారులు తీరుతున్నారు. ఈ రెండు భాషలలోనూ స్టార్ హీరోలు అందరి సరసన నటించే అవకాశాలు వాటంతట అవే వచ్చేశాయి. నటనలో కూడా పరిణతి చూపుతూ అదే స్థాయిలో ఆమె దూసుకుపోతోంది.

ఈ రేంజ్లో ఉన్న సమంతకు ఇప్పుడు ఓ చిక్కువచ్చి పడింది. ఆమె స్పీడ్కు మరో హీరోయిన్ బ్రేకులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంతతో శృతిహాసన్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతోంది. తెలుగులో మాత్రం  సమంత  మరే హీరోయిన్కు అందనంత ఎత్తులో  కొనసాగుతోంది. ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ కొట్టాయి. దాంతో తెలుగులో బాగా క్రేజ్ ఏర్పడింది. ఈ ఊపుతో సొంత భాష తమిళంలో కూడా  హవా కొనసాగించాలని ఈ అమ్మడు చూస్తోంది. అనుకున్నట్లు ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో కూడా యామ స్పీడ్‌గా టాప్ ప్లేస్‌కు చేరుతోంది.

ఇదే సమయంలో  సమంతకు పోటీగా మరో ముద్దుగుమ్మ శృతిహసన్ తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొన్నటివరకు బాలీవుడ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన శృతి  తాజాగా తమిళంలో స్థిరపడాలన్న ఆలోచనతో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ ఉద్దేశంతోనే తమిళ చిత్రాల పట్ల ఆసక్తి చూపుతోంది.  ప్రస్తుతం విశాల్ సరసన పూజై సినిమాలో నటిస్తోంది.  మళ్లీ ఇటీవలే స్టార్ హీరో విజయ్తో కలసి నటించేందుకు  అంగీకరించినట్లు సమాచారం.

త్వరలో మరి కొంతమంది స్టార్ హీరోల సినిమాలకి కూడా ఈ నాజూకు సుందరి సంతకం చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  ఇలా వరుసగా తమిళ సినిమాలను శృతి తన ఖాతాలో వేసుకుంటూ సమంత ఆశలపై నీళ్ళు చల్లుతోంది. వీరిద్దరిలో  కోలీవుడ్లో  ఎవరు అగ్రస్థానానికి  చేరతారో కొంతకాలం వేచి చూడవలసిందే.

 - శిసూర్య

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి