ప్రాణాలను పణంగా పెట్టి తీశాం

17 Aug, 2016 01:14 IST|Sakshi
ప్రాణాలను పణంగా పెట్టి తీశాం

కీకారణ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి తగడు చిత్రాన్ని తెరకెక్కించామని ఆ చిత్ర దర్శకుడు ఎం.తంగదురై వెల్లడించారు. రాగదేవి ప్రొడక్షన్స్ పతాకంపై రాజేంద్రన్ కుప్పసామి నిర్మించిన చిత్రం తగడు. ప్రభ, అజయ్, సనంశెట్టి, దీపక్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.చార్లస్ మిల్విన్ సంగీతాన్ని, ఇళయకంభన్ పాటల్ని అందించారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఏదైనా ఒక విషయాన్ని కొత్తగా చేసి సాధించాలన్న లక్ష్యంతో తపించే ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులకు ఒక సీడీ దొరుకుతుందన్నారు.
 
 అందులోని సమాచారం ప్రకారం వివరాలు శోధించడానికి నడుం బిగించి అడవుల్లోకి వెళతారన్నారు. అక్కడ వారు ఎదుర్కొన్న సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు? వారి లక్ష్యాన్ని సాధించారా? అన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో కూడిన చిత్రం తగడు అని తెలిపారు. కారరణ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు.అయితే చిత్రం చూసిన తరువాత కష్టానికి తప్పకుండా మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకం కలిగిందని, ఈ నెల 19న తగడు చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.