షరతులు వర్తిస్తాయి!

14 Jan, 2018 04:01 IST|Sakshi

తమిళసినిమా: ఇకపై నిబంధనలు వర్తిస్తాయి(కండిషన్స్‌ అప్లై) అంటోంది నటి నయనతార. నటిగా ఒకప్పటి స్థాయి వేరు ఇప్పటి నయన్‌ స్థానం వేరు. ఆదిలో నటిగా స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఇమేజ్‌ను కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. మొదట్లో దర్శకుల సూచనలతో నటించేవారు. అందాలారబోత విషయంలో హద్దుల పరిధి విధించుకోలేదు. టూపీస్‌ దుస్తుల నటనకు పరాకాష్ట బిల్లా చిత్రం. అయితే అదంతా గతం. ఇప్పటి నయన్‌ స్థాయి వేరు. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మొదలెట్టారో.. అప్పటి నుంచి అభిమానులు ఈ బ్యూటీకి ‘లేడీసూపర్‌స్టార్‌’ పట్టం కట్టేశారు. అరమ్‌ చిత్రంతో నయనతార లెవెల్‌ వేరు అన్నంతగా మారిపోయింది. గతంలో ప్రేమ ఓటమి, తాజాగా ప్రియుడితో సహజీవనం వంటివి నయన్‌ నట జీవితానికి ఎలాంటి ఆటంకం కాలేదన్నది నిజం. కరెక్ట్‌గా చెప్పాలంటే మొదట్లో దర్శకులు శాసించినట్లు నయన్‌ నటించేవారు.

ఇప్పుడు ఆమె ఆదేశాలను దర్శక నిర్మాతలు పాటించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని గ్రహించిన నయన్‌ ఇకపై నిబంధనలు వర్తిస్తాయి అని అంటోందట. ముఖ్యంగా ఇంతకు ముందు మాదిరి హీరోలతో సన్నిహితంగా నటించేది లేదు. ఇక ఒక పరిమితికి మించి కురుచ దుస్తులు ధరించను అని దర్శక నిర్మాతలకు కథ వినిపించినప్పుడే స్పష్టంగా చెప్తోందట. ప్రచార కార్యక్రమాలకు దూరం ఉండే పరిస్థితి ఇకపై కూడా కొనసాగుతుందని చెబుతుందట. ఇటీవల నయన్‌ నటించిన తెలుగు చిత్రం ‘జైసింహా’లో కూడా దుస్తులు,  హీరోతో సన్నిహితంగా నటించే విషయాల్లో పరిమితులు పాటించిందట. ఇలా ఈ అమ్మడు తన చిత్ర ప్రయాణాన్ని ఇంకా ఎంతకాలం సాగించుకుంటుందో. ప్రస్తుతం చేతిలో ఐదు చిత్రాలతో బిజీగా ఉంది. తను ఊ అంటే మరిన్ని అవకాశాలు రెడీగా ఉన్నాయట. ఇమైకానోడిగళ్, కొలైయుధీర్‌ కాలం, కొలమావు కోకిల, తెలుగులో సైరా నరసింహారెడ్డి, ఆరడుగుల బుల్లెట్టు చిత్రాల్లో నయన్‌ ప్రస్తుతం నటిస్తోంది. ఇక అరమ్‌ చిత్రానికి సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు