లారాను తప్పుగా చిత్రీకరించలేదు

15 Nov, 2018 01:20 IST|Sakshi
పద్మనాభ రెడ్డి, తనీష్, కార్తికేయ

విజయవాడకు చెందిన పవన్‌ కుమార్‌ (లారా) కథతో ‘రంగు’ చిత్రం రూపొందింది. తనీష్‌ ముఖ్య పాత్రలో కార్తికేయ దర్శకత్వం వహించారు. పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించారు. ఈ చిత్రంలో లారాను ఎలా చూపించబోతున్నారో మాకు తెలియాలి. మా అనుమతి తీసుకోకుండా సినిమా విడుదల చేస్తే థియేటర్స్‌లో ‘రంగు’ పడనివ్వం అని సోమవారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు లారా బంధువులు. దానికి సమాధానంగా ‘రంగు’ చిత్రబృందం బుధవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘లారా బంధువుల ఆరోపణలు సబబుగానే అనిపించాయి. కానీ మేం లారాని ఎక్కడా తప్పుగా చూపించలేదు.

సినిమా చూస్తే ఆయన మీద మంచి అభిప్రాయమే కలుగుతుంది. ఈ శని, ఆదివారాల్లో లారా కుటుంబ సభ్యులకు షో వేసి చిత్రాన్ని చూపిస్తాం. ఈ నెల 23న సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘మనిషి సమాజంలో ఎలా ఉండకూడదో చెప్పే సినిమా ఇది. లారా పాత్ర, ఐడియాలజీ.. అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా చూస్తే వాళ్ల కుటుంబ సభ్యులకు కళ్లలో నీళ్లు తిరుగుతాయి’’ అని తనీష్‌ అన్నారు. ‘‘2011 నుంచి నేను లారాని స్టడీ చేసి ఈ కథ రాసుకున్నాను. ఆయన బావమరిదిని కలవలేదు. కానీ ఆయన స్నేహితులను కలిశాను. సినిమా చూస్తే లారా మన మధ్య ఇంకా తిరుగుతున్నారనే భావన కలుగుతుంది’’ అని కార్తికేయ అన్నారు. చిత్రనిర్మాత నల్ల అయ్యన్న నాయుడు, సహ నిర్మాత వాసు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు