కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌ 

29 Mar, 2020 16:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో మార్చి 30న తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపాడు. అదేవిధంగా ఫ్యాన్స్‌ కూడా తన బర్త్‌డే వేడుకలను జరపవద్దని విజ్ఞప్తి చేశాడు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 16న జరగాల్సిన తన పెళ్లి గురించి కూడా నితిన్‌ క్లారిటీ ఇచ్చాడు.  దీంతో తన పెళ్లిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టాడు. 

‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడివున్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని లాక్‌డౌన్‌ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. 

అంతే కాదు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లో మనం కాలు మీద కాలేసుకొని కూర్చుని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు. ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్ని ఆశించే మీ.. నితిన్‌’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సంపత్ కుమార్, నూర్జహాన్ దంపతుల రెండవ కుమార్తె షాలినితో నితిన్ పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో నిశితార్థం కూడా జరిగింది. ఏప్రిల్ 16న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డిండ్‌ జరపుకోవాలని నితిన్‌ నిర్ణయించుకున్నాడు. అయితే కరోనా విజృంభిస్తుండటం లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్ల నితిన్‌ అధికారికంగా ప్రకటించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా