కోలీవుడ్‌ను భయపెడుతున్న కరోనా

16 Mar, 2020 07:28 IST|Sakshi

కరోనా మహమ్మారి కోలీవుడ్‌ను భయపెడుతోంది. ప్రపంచదేశాలను భయ భ్రాంతులకు గురిచేస్తున్న వైరస్‌ కరోనా, ఇప్పటికే వేలాది మందిని బలితీసుకుంది. అయితే ఉష్ణోగ్రతల భూభాగం అయిన మనదేశానికి కరోసా వైరస్‌ పాకే అవకాశం లేదని ధైర్యంగా ఉన్నాం. అయితే అది ఇప్పుడు మన దేశంలోనూ విజృంభించడం భీతికి గురిచేస్తోంది. ఇప్పటికే ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న కరోనా చిత్రపరిశ్రమను కలత చెందిస్తోంది. కోలీవుడ్‌లో పలు చిత్రాల షూటింగ్‌లను రద్దు చేసుకునేలా చేస్తోంది. మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం పొన్నియన్‌ సెల్వన్, సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌లో రెండు భాగాలుగా మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటుడు విక్రమ్, జయంరవి, కార్తీ, అమితాబ్‌బచ్చన్, ప్రభు, ఐశ్వర్యారాయ్, విక్రమ్‌ప్రభు వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే  థాయ్‌ల్యాండ్, చెన్నై, పాండిచ్చేరి, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంది. కాగా తాజాగా పూణేలో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేసుకుంది.

కాగా ఇప్పుడు కరోనా భీతితో పూణే షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. అదే విధంగా నటుడు విక్రమ్‌ హీరోగా నటిస్తున్న కోబ్రా చిత్ర షూటింగ్‌కు కరోనా ఎఫెక్ట్‌ ఇచ్చింది. నటుడు కార్తీ, రష్మిక జంటగా నటిస్తున్న సుల్తాన్‌ చిత్రం చిత్ర షూటింగ్‌ను రద్దు చేసినట్లు సమాచారం, ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌.ప్రకాశ్,ఎస్‌ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. భాగ్యరాజ్‌ కన్నన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అప్‌డేట్‌ గురించి నిర్మాత ఆర్‌ఎస్‌.ప్రభు మాట్లాడుతూ కరోనా అంతటా వైరల్‌ అవుతోందని అందుకని సుల్తాన్‌ చిత్ర విషయంలో ప్రశాంతంగా, భద్రంగా ఉందాం అని ట్విట్టర్‌లో టీట్‌ చేశారు. 

సినిమా థియేటర్లకు కరోనా ఎఫెక్ట్‌ 
కాగా కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌  సినిమా థియేటర్లపైనా పడింది. రాష్టంలో కరోనా కలకలం చెలరేగటంతో తమిళనాడులోని  16 జిల్లాల్లోని థియేటర్లు మూత పడనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఒక ప్రకటనను ఆదివారం విడుదల చేశారు. అందులో కరోనా వైరస్‌ను నిరోధించే విధంగా  సరిహద్దు ప్రాంత జిల్లాలు తేనీ, కన్యాకుమారి, తిరుపూర్,కోయంబత్తూర్,నీలగిరి, కృష్ణగిరి, తిరునెల్వేలి, తిరువళ్లూర్, వేలూర్, తిరుప్పత్తూర్, రాణిపేట, ఈరోడ్డు, దిండుగళ్, ధర్మపురి, విరుదనగర్‌ సహా 16 జిల్లాలోని సినిమా థియేటర్లను ఈ నెల 31వ తేదీ వరకు మూసి వేయాలని ఆదేశించారు. జనరద్దీ కలిగిన వాణిజ్య సముదాయాలను మూసి వేయాలన్నారు. 

మరిన్ని వార్తలు